టోక్యో ఒలింపిక్స్(Tokyo Olympics 2021)లో తాను సాధించిన కాంస్యం(bajrang punia bronze) కుటుంబ సభ్యులకు స్వర్ణంతో సమానమని భారత కుస్తీవీరుడు బజరంగ్ పునియా అంటున్నాడు. ప్లేఆఫ్ మ్యాచుకు ముందు తన మోకాలి గాయం గురించి తన తల్లి ఓం ప్యారీ భయపడిందని గుర్తు చేసుకున్నాడు. పతకం కన్నా ఎక్కువగా గాయం గురించి ఆలోచించిందని వెల్లడించాడు. టోక్యో నుంచి స్వదేశానికి తిరిగొచ్చిన బజరంగ్ ఈటీవీ భారత్‌తో ముచ్చటించాడు. పలు విషయాలు తెలిపాడు.
"సెమీస్‌లో హజీ అలియెవ్ చేతిలో ఓటమి తర్వాత నా గదిలోకి వెళ్లి త్వరగా పడుకున్నా. ఎవరితోనూ మాట్లాడాలని అనిపించలేదు. ఆ తర్వాత ఇంటికి ఫోన్ చేసి అమ్మతో మాట్లాడా. రెజ్లింగ్ కన్నా ఎక్కువగా నా గాయం గురించే ఆమె భయపడుతున్నట్టు చెప్పింది. గెలుపోటములు ఆటలో భాగమంది. ముందు నా మోకాలిని రక్షించుకోవాలని సూచించింది. పతకం కన్నా నా ఆరోగ్యమే ముఖ్యమని అమ్మ చెప్పింది" అని బజరంగ్ అన్నాడు.
"పిల్లలు పతకాలు గెలవాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. గాయపడ్డా గెలిచిన ఈ కాంస్యం తమకు బంగారంతో సమానమని నా కుటుంబ సభ్యులు అన్నారు. ఎందుకంటే గాయం వల్ల నేను రష్యాలో 20-25 రోజులు మ్యాటుకు దూరమైన సంగతి వారికి తెలుసు" అని బజరంగ్ వెల్లడించాడు.
రష్యాలో ఓ టోర్నీలో పోటీపడిన బజరంగ్ మోకాలికి జూన్ 25న గాయమైంది. దాంతో మూడు వారాలు ఆటకు దూరమయ్యాడు. టోక్యోకు అర్హత సాధించడంపైనా సందిగ్ధం ఏర్పడింది. ఒలింపిక్స్ సెమీస్‌లోనూ మోకాలికి గాయం కావడం వల్ల కోచ్‌లు మోకాలు పట్టీ ధరించి ప్లేఆఫ్ మ్యాచ్ ఆడాలని సూచించారు. అందుకు సమ్మతించని బజరంగ్ ఏదేమైనా సరే నేరుగానే తలపడాలని నిర్ణయించుకున్నాడు.
"నాకు నొప్పి ఉండటం వల్ల ఫిజియో పట్టీ ఇచ్చాడు. సౌకర్యంగా లేకపోయినా తొలి రెండు రౌండ్లు పట్టీ ధరించా. కానీ అది నా కదలికలకు అడ్డంకిగా మారింది. అందుకే కాంస్య పతక పోరులో దానిని తీసేశా. గాయం మరింత తీవ్రమైతే ఆ తర్వాత చూసుకుందాం. కానీ నేను కాంస్యం గెలవకపోతే ఇంకేం చేయగలం అని నా కోచులతో చెప్పా. నాకు పతకమే ముఖ్యం. ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టీ ధరించనని చెప్పాను. ఏదేమైనా కాంస్యం అందుకున్నందుకు సంతోషంగా ఉంది" అని బజరంగ్ తెలిపాడు.
ఇదీ చదవండి:విశ్వక్రీడల్లో మనం.. దేశానికి రావాలి మరెన్నో పతకాలు!