టోక్యో ఒలింపిక్స్‌లో భారత మహిళల జట్టుకు నిరాశే మిగిలింది. కాంస్యం కోసం బ్రిటన్‌తో జరిగిన పోరులో రాణిరాంపాల్ సేన 3-4 తేడాతో ఓడింది. మ్యాచ్ ఆసాంతం అద్భుత ప్రదర్శన చేసిన భారత అమ్మాయిలు.. కాంస్యం కోసం తీవ్రంగా శ్రమించారు.
తొలి అర్ధభాగంలో 3-2 తేడాతో భారత్ ఆధిక్యంలో నిలవగా.. మూడో క్వార్టర్‌లో బ్రిటన్ మరో గోల్ చేసి స్కోరు సమం చేసింది. ఆ తర్వాత నాలుగో క్వార్టర్ ఆరంభంలో మరో గోల్ చేసి 4-3 బ్రిటన్ ఆధిక్యంలోకి వెళ్లింది. అనంతరం స్కోరు సమం చేసేందుకు భారత్ అమ్మాయిలు తీవ్రంగా శ్రమించినా అదృష్టం కలిసి రాలేదు.
ఈ మ్యాచ్‌లో బ్రిటన్ చేసిన అనేక గోల్ ప్రయత్నాలను భారతగోల్ కీపర్ సవిత పూనియా సమర్థంగా నిలువరించింది. మ్యాచ్ ఓడినప్పటికీ అమ్మాయిలు స్ఫూర్తిమంతమైన ఆటతీరుతో అందరి మనసులను గెలుచుకున్నారు. టోక్యో ఒలింపిక్స్ గ్రూప్ దశలోనే వెనుతిరిగే దశ నుంచి కాంస్యం కోసం పోరాడే వరకు రాణిరాంపాల్ సేన చేసిన ప్రదర్శన.. అందరి మన్ననలు అందుకుంటోంది.