రాజస్థాన్ జైపుర్‌కు చెందిన 19ఏళ్ల రైఫిల్ షూటర్ అవని లేఖరా(Avani lekhara).. అరుదైన ఫీట్ సాధించింది. ఒకే పారాలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించి భారత్ తరఫున రికార్డ్ సృష్టించింది.
టోక్యో పారాలింపిక్స్‌లో(Tokyo Paralympics) పాల్గొన్న పిన్న వయస్కురాల్లో అవని ఒకరు. 2012లో పదేళ్ల వయసులో ఈమెకు కారు ప్రమాదం జరిగింది. తన వెన్ను పూస విరిగిపోయింది. నడుము కింద భాగం చచ్చుబడి చక్రాల కుర్చీకే పరిమితమైంది. మూడేళ్లపాటు ఎన్నో సర్జరీలు, ఫిజియోథెరపీ సెషన్లు.. చేసినా ఫలితం లేకుండా పోయింది. బడిలో చేర్చుకోవడానికి ఎవరూ ముందుకు రాకపోవడం వల్ల రెండేళ్లు ఇంట్లోనే చదువుకుంది. తర్వాత కేంద్రీయ విశ్వవిద్యాలయంలో(Kendriya vidyalaya) సీటు దొరికింది.
ప్రేమలో పడిపోయాను.
బాధను దిగమింగుకుని ఏదైనా రంగంలో పట్టు సాధించాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఓసారి తన తండ్రి.. లేఖరాను ఆర్చరీ, షూటింగ్ రేంజ్‌లకు తీసుకెళ్లారు. 'అక్కడ మొదటిసారి రైఫిల్‌ను చేతితో తాకినప్పుడే దాంతో ప్రేమలో పడిపోయాను. నాలో స్ఫూర్తి నింపడానికి ఆయన... అభినవ్ బింద్రా(Abhinav Bindra) రాసిన 'ఎ షాట్ ఎట్ హిస్టరీ'(A shot at history) పుస్తకం ఇచ్చారు. అది చదివాక సీరియస్‌గా సాధన ప్రారంభించా. ఎప్పటికైనా దేశానికి బంగారు పతకం అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నా' అని అవని చెప్పింది.
మొదటి ఏడాదే మూడు పతకాలు..
గత కొన్నేళ్లుగా అవని సాధించిన విజయాలు ఆమె పట్టుదలకు నిదర్శనం. శిక్షణ తీసుకున్న మొదటి ఏడాదే జాతీయ ఛాంపియన్ షిప్ పోటీల్లో మూడు పతకాలు సొంతం చేసుకుంది. అప్పటికి ఆమెకో సొంత రైఫిల్ కూడా లేదు. కోచ్ దగ్గర అరువు తెచ్చుకుంది. 2017లో ఆన్‌ఐన్‌ఓలో జరిగిన పారా షూటింగ్ వరల్డ్‌కప్‌లో రజతం గెలుచుకుంది. కరోనా(Carona) కారణంగా గతేడాది నుంచి ఫిజియోథెరపీ సెషన్‌లు లేకపోయినా.. సరైన శిక్షణా, సదుపాయాలు, పరికరాలు లేకపోయినా.. ఇంటి దగ్గరే సాధన చేసి పారాలింపిక్స్‌లో స్వర్ణ పతకాన్ని ముద్దాడింది. శుక్రవారం మరో పోటీలో కాంస్యం సాధించి.. పారాలింపిక్స్‌లో రెండు పతకాలు గెలిచిన తొలి భారతీయ మహిళా షూటర్‌గా నిలిచింది.
"ఫైనల్ పోరు చాలా కఠినంగా ఉంటుంది. కానీ, కాంస్యం గెలవడం చాలా ఆనందంగా అనిపించింది. ఇంతకన్నా బెటర్‌గా ప్రదర్శించాల్సింది. మొదటిసారి పాల్గొన్న పారాలింపిక్స్‌లోనే రెండు పతకాలు సాధించడం సరికొత్త అనుభూతి. దీనికోసం నేను కొన్ని నెలలపాటు శ్రమించాను. 100 శాతం గెలవడానికే ప్రయత్నించాను."
--అవని లేఖరా, షూటర్.
భారత్ తరఫున రెండు పతకాలు సాధించిన అవని లేఖరాను ప్రశంసించారు ప్రధాని నరేంద్ర మోదీ. భవిష్యత్తులో లేఖరా మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఇదీ చదవండి:Tokyo Paralympics: అవనికి కాంస్యం.. 12కు చేరిన భారత పతకాలు