టోక్యో ఒలింపిక్స్(Tokyo Olympics).. కోటి ఆశలతో బరిలో దిగిన భారత అథ్లెట్లు.. మిశ్రమ ఫలితాలు.. గతంతో పోలిస్తే పెద్దగా మార్పులేమీ లేకుండానే స్వదేశానికి తిరిగొచ్చారు. అయితే.. జావెలిన్ త్రోలో నీరజ్ చోప్డా స్వర్ణం సాధించడం గొప్ప ఘనత. వెయిట్ లిఫ్టింగ్, బ్యాడ్మింటన్, బాక్సింగ్ లాంటి క్రీడల్లోనూ మన అమ్మాయిలు అద్భుతం చేశారు. దేశం యావత్తు గర్వపడేలా పతకాలు గెలుచుకున్నారు. అయితే కచ్చితంగా పతకాలు సాధిస్తారు అనుకున్న కొందరు క్రీడాకారులు మాత్రం నిరాశపరచడం కాస్త అసంతృప్తి కలిగించే విషయం. ఇంతకీ వాళ్లెవరు? వారి సంగతేంటి?
దీపికా కుమారి, అతాను దాస్(ఆర్చరీ)
ప్రపంచ నం.1 మహిళా ఆర్చర్ దీపికా కుమారి(Deepika Kumari).. టోక్యో ఒలింపిక్స్‌కు పతకమే లక్ష్యంగా బరిలో దిగింది. కర్మ(భూటాన్), మకినో ఫెర్నాండెజ్(యూఎస్), పెరోవాపై(రష్యా) గెలిచి క్వార్టర్స్‌లో అడుగుపెట్టిన ఈమె.. అక్కడ టాప్ సీడ్ క్రీడాకారిణి అన్ సున్(దక్షిణ కొరియా) చేతిలో ఓడి, ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించింది.
మిక్స్డ్ టీం విభాగంలోనూ.. ప్రవీణ్ జాదవ్‌తో కలిసి పోరాడిన దీపిక ఒక మ్యాచ్ మాత్రమే గెలిచింది. క్వార్టర్ ఫైనల్లో రిపబ్లిక్ ఆఫ్ కొరియా చేతిలో ఓడింది.
పురుషుల విభాగంలో పోటీపడిన స్టార్ ప్లేయర్ అతాన్ దాస్(దీపిక భర్త) (Atanu Das) కూడా మెడల్ ఫేవరేట్‌గా ఒలింపిక్స్‌లో అడుగుపెట్టాడు. వైసీ డెంగ్(చైనీస్ తైపీ), ఓ జిన్‌పై(దక్షిణ కొరియా) వరుసగా గెలిచిన ఇతడు.. క్వార్టర్ ఫైనల్లో ఫురుకువా(జపాన్) చేతిలో ఓటమిపాలయ్యాడు.
మేరీకోమ్, అమిత్ పంగాల్ (బాక్సింగ్)
2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్యం, ఆరు సార్లు ప్రపంచ ఛాంపియన్, ఆసియా గేమ్స్, ఆసియా ఛాంపియన్షిప్స్, కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణాలు గెలుచుకున్న మహిళా స్టార్ బాక్సర్ మేరీకోమ్(Mery Kom).. టోక్యోలో ఫేవరేట్‌గా పాల్గొంది. కానీ రౌండ్-32లో సులభంగా గెలిచిన ఆమె.. తర్వాత రౌండ్లో వాలన్సియా(కొలంబియా) చేతిలో 3-2 తేడాతో ఓడిపోయింది. అయితే.. ఆ మ్యాచ్‌లో తనకు అన్యాయం జరిగిందని చెప్పింది మేరీ. రెండు రౌండ్లలో ఆమెనే నెగ్గినా మొత్తంగా వాలన్సియాదే పైచేయి కావడం వల్ల విజయం ప్రత్యర్థినే వరించింది. మేరీ కోమ్కు ఇదే చివరి ఒలింపిక్స్!
పురుషుల 49 కేజీల విభాగంలో పోటీపడిన టాప్ సీడ్, అమిత్ పంగాల్ (Amit Panghal).. కొలంబియాకు చెందిన మార్టినెజ్ చేతిలో 4-1 తేడాతో తొలి పోరులోనే ఓడి, ఇంటిముఖం పట్టాడు.
మను బాకర్, సౌరభ్ చౌదరి (షూటింగ్)
ఈసారి పక్కా ఒలింపిక్స్ పతకం గెలుస్తారు అనుకున్నవారిలో యువ షూటర్లు మను బాకర్(Manu Bhaker), సౌరభ్ చౌదరి ముందు వరుసలో ఉన్నారు. కానీ వీరిద్దరూ వ్యక్తిగత, టీమ్ ఈవెంట్లో పూర్తిగా నిరాశపరిచారు. మహిళల 25 మీటర్ల పిస్టల్, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీం, మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగాల్లో పోటీపడిన మను.. పతకం తేలేకపోయింది. మిక్స్డ్ టీం విభాగంలో ఫైనల్ చేరినా.. అక్కడ నిరాశాజనక ప్రదర్శన చేసింది. ఆమె వైఫల్యానికి గన్‌లో సాంకేతిక ఇబ్బందీ ఓ కారణం!
సౌరభ్ చౌదరి(Saurabh Chaudhary).. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీం(మను బాకర్- చౌదరి) విభాగాల్లో పాల్గొన్నాడు. రెండింటిలోనూ క్వాలిఫికేషన్ రౌండ్లో అగ్రస్థానంలో నిలిచినా.. ఫైనల్లో చతికిలపడ్డాడు.
మనికా బాత్రా, శరత్ కమల్ (టేబుల్ టెన్నిస్)
భారత్‌కు పతకం వస్తుందని అనుకున్న మరో విభాగం టేబుల్ టెన్నిస్. గత కొన్నేళ్లుగా అద్భుత ప్రదర్శన చేస్తున్న మనికా బాత్రాపై(Manika Batra) ఆశలు బాగానే పెట్టుకున్నారు. కానీ ఈమె.. మహిళల సింగిల్స్ మూడో రౌండ్లో, మిక్స్డ్ విభాగంలోని రౌండ్-16లో ఓటమిపాలైంది. శరత్ కమల్(Sharath Kamal Achanta) కూడా మనిక తరహాలోనే పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో, మిక్స్డ్ విభాగంలో రౌండ్-16 వరకు మాత్రమే వెళ్లాడు.
వినేశ్ ఫొగాట్ (రెజ్లింగ్)
రియో(2016) ఒలింపిక్స్‌లో గాయం కారణంగా అనూహ్యంగా వైదొలిగి, ఈసారి పతకం పట్టేయాలనే దూకుడుతో బరిలో దిగింది స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్(Vinesh Phogat). కానీ క్వార్టర్స్‌లో వెనెసా(బల్గేరియా) చేతిలో 3-9 తేడాతో ఓడింది. దీంతో పతకం కోసం మరోసారి ఈమెకు ఎదురుచూపులు తప్పలేదు.
ఇదీ చూడండి.. Olympics 2020: మేరీ కోమ్ అందుకే ఓడిపోయిందా?