విశ్వక్రీడల్లో(Tokyo Paralympics) పతకం సాధించడం అంటే చిన్న విషయం కాదు. ఆ వేదికపై పతకం సాధించేందుకు ఏళ్ల తరబడి కఠోర శ్రమతో పాటు నిష్ణాతుల సూచనలు, సలహాలను క్రీడాకారులు పాటిస్తారు. అయితే కోచ్‌ల సహాయం లేకుండా.. శిక్షణ కోసం కేవలం గూగుల్‌పై ఆధారపడి మెడల్ సాధించడమంటే మాటలా చెప్పండి? అలాంటి పరిస్థితుల్లోనే ఓ పారా అథ్లెట్ అద్భుతం చేశాడు. కోచ్ లేకుండానే ఆటలో మెలకువలు తెలుసుకునేందుకు గూగుల్‌ను ఆశ్రయించి.. పారాలింపిక్స్ హైజంప్ క్రీడలో(Praveen Kumar High jump) రజత పతకాన్ని ముద్దాడాడు. అతడే భారత క్రీడాకారుడు ప్రవీణ్ కుమార్.
"గూగుల్‌లో హైజంప్ వీడియోలను చూసి.. వాటి నుంచి ఎలా సాధన చేయాలో నేర్చుకున్నాను. తొలుత ఈ ఆట గురించి నాకు ఎవరూ శిక్షణ ఇవ్వలేదు. ఆ తర్వాత జిల్లాస్థాయి మీటింగ్‌లో డా.సత్యపాల్‌ను కలిశాను. అప్పటి నుంచి ఆయన నాకు శిక్షణ ఇచ్చేందుకు అంగీకరించారు.
- ప్రవీణ్ కుమార్, పారాలింపిక్ క్రీడాకారుడు
వాలీబాల్ ప్లేయర్‌గా కెరీర్ ప్రారంభించిన ప్రవీణ్ కుమార్.. అనూహ్యంగా హైజంప్‌పై ప్రేమను పెంచుకున్నాడు. 'తొలుత నేను వాలీబాల్ ప్లేయర్‌ను. ఆ తర్వాత నాకు పారా-అథ్లెటిక్స్ గురించి తెలిసిన తర్వాత 2016లో హైజంప్ విభాగంలో పాల్గొన్నాను. దీనిపై అవగాహన కోసం తొలిసారి గూగుల్ వీడియోలు చూసి ప్రాక్టీస్ చేశాను. ఆ తర్వాత జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొన్నప్పుడు సత్యపాల్‌ను కలిశాను' అని ప్రవీణ్ వెల్లడించాడు.
18 ఏళ్లకే పతకం
టోక్యో పారాలింపిక్స్‌లో శుక్రవారం జరిగిన టి64 హైజంప్‌లో ప్రవీణ్ కుమార్ అద్భుతం చేశాడు. పారాలింపిక్స్ అరంగేట్రంలోనే పతకం సాధించాడు. 2.07 మీటర్లు గెంతి సరికొత్త ఆసియా రికార్డు సృష్టించాడు. స్వర్ణం అందుకున్న జొనాథన్ బ్రూమ్ ఎడ్వర్డ్స్ 2.10 మీటర్లు గెంతడం గమనార్హం. అయితే, భారత బృందంలో అత్యంత పిన్న వయసులోనే పతకం అందుకున్నది ప్రవీణ్ కుమారే (18 ఏళ్లు) కావడం విశేషం.
ప్రవీణ్ కుమార్ అత్యుత్తమ ప్రదర్శన ఇదే. నోయిడాకు చెందిన అతడు 2019లో ఈ క్రీడలో అడుగుపెట్టాడు. అదే ఏడాది జూనియర్ పారా ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రజతం ముద్దాడాడు. కొన్నేళ్లుగా అతడు జాతీయ కోచ్ సత్యపాల్ సింగ్ నేతృత్వంలో శిక్షణ తీసుకుంటున్నాడు. బాల్యం నుంచి అతడు సాధారణ అథ్లెట్లతోనే పోటీపడటం ప్రత్యేకం.
ఇదీ చూడండి.. ప్రవీణ్‌కు రజతం.. కొనియాడిన ప్రధాని మోదీ