ఒలింపిక్స్‌లో వరల్డ్ నం.1 ఆర్చర్ దీపికా కుమారి క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. మహిళల వ్యక్తిగత విభాగంలో 1/8 ఎలిమినేషన్ రౌండ్లో రష్యా ఒలింపిక్ కమిటీ క్రీడాకారిణిపై విజయం సాధించింది. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో పెరోవాపై 6-5 తేడాతో దీపిక గెలిచింది.
తొలి సెట్ దీపికా కుమారి నెగ్గగా.. రెండో సెట్ పెరోవా గెలిచింది. మూడో సెట్ మళ్లీ దీపికా సొంతం చేసుకుంది. నాలుగో సెట్ టై కాగా.. ఐదో సెట్లో ప్రత్యర్థి పెరోవాదే పైచేయి కావటం వల్ల.. మ్యాచ్ స్కోరు 5-5తో సమమైంది. షూట్ ఆఫ్‌లో రష్యా క్రీడాకారిణి పెరోవా 7 నంబర్‌పై బాణం వేయగా, దీపిక ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా 10 మార్క్‌పై బాణం వేసి విజయం సాధించింది.
మాజీ ప్రపంచ ఛాంపియన్ అయిన పెరోవాతో దీపికాకుమారి ఇప్పటివరకు మూడుసార్లు తలపడగా.. ఇదే తొలి విజయం. ఈ గెలుపుతో దీపిక.. క్వార్టర్స్‌లో దక్షిణ కొరియా క్రీడాకారిణి, టాప్ సీడ్ అన్ సాన్తో తలపడనుంది.
ఇది చదవండి: Deepika Kumari: ఈసారి గురిచూసి కొట్టాలని!