కమల్‌ప్రీత్ కౌర్.. ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం ఖాయం చేసేలా కనిపిస్తున్న డిస్కస్ త్రో అథ్లెట్. ఇప్పుడైతే ఆమె ఫైనల్లో పోటీపడేందుకు అర్హత సాధించింది కానీ.. గతేడాది లాక్‌డౌన్ కారణంగా ఎంతో మానసిక ఒత్తిడికి లోనైంది. కరోనా వైరస్ ప్రభావంతో సరైన ప్రాక్టీస్ లేక, ఇతర పోటీల్లో పాల్గొనే వీలు లేక కుంగుబాటుకు గురైంది. ఈ క్రమంలోనే దాన్ని అధిగమించేందుకు కమల్‌ప్రీత్ క్రికెట్ బ్యాట్ పట్టింది. అయితే, దీనిమీద పూర్తిస్థాయి ఆసక్తి చూపకపోయినా తన ఇబ్బందులను అధిగమించడానికి క్రికెట్‌ను ఒక సాధనంలా ఉపయోగించుకుంది.
పేద కుటుంబం కావడంతో అనాసక్తి..
కమల్‌ప్రీత్‌ది పంజాబ్‌లోని బాదల్ ప్రాంతంలోని చిన్న గ్రామం. ఆమెది పేద వ్యవసాయ కుటుంబం కావడంతో మొదట్లోనే క్రీడలపై ఆసక్తి చూపలేదు. దానికి తోడు ఆమె తల్లి కూడా అందుకు ఒప్పుకోకపోవడంతో వాటి గురించి ఆలోచించలేదు. అయితే, కమల్‌ప్రీత్ తండ్రి కుల్‌దీప్ సింగ్ వెన్నుతట్టి ప్రోత్సహించారు. దాంతో ఆమె తొలుత షాట్‌పుట్‌లో శిక్షణ తీసుకుంది. తర్వాత డిస్కస్ త్రోలో ప్రావీణ్యం సంపాదించి ఇందులో కొనసాగుతోంది. ఇక 2014లో బాదల్‌లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా శిక్షణా కేంద్రంలో చేరాక కమల్‌ప్రీత్ జీవితం మారిపోయింది.
స్కూల్ టీచర్ ప్రోత్సాహంతో..
2011-12లో కమల్‌ప్రీత్ బాదల్‌లో పాఠశాల విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు అక్కడి స్పోర్ట్స్ టీచర్ ప్రోత్సహించారు. దాంతో ఆమె జోనల్, జిల్లా స్థాయిల పోటీల్లో పాల్గొంది. అక్కడ చక్కటి ప్రతిభ కనబర్చడంతో 2013లో అండర్-18 జాతీయ జూనియర్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో తలపడింది. అప్పుడు డిస్కస్ త్రోలో మెరుగైన ప్రదర్శన చేసి రెండో స్థానంలో నిలిచింది. దాంతో జూనియర్ ఛాంపియన్‌గా అవతరించింది. అనంతరం 2016 జాతీయ పోటీల్లో విజేతగా నిలిచి తొలిసారి సీనియర్ విభాగంలో బంగారు పతకం సాధించింది. అప్పుడామె ప్రదర్శన 54.25 మీటర్లుగా నమోదైంది. తర్వాత వరుసగా జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తూ మరింత రాటుదేలింది. ఈ క్రమంలోనే గతేడాది లాక్‌డౌన్ సమయంలో సరైన ప్రాక్టీస్ లేక మానసిక ఒత్తిడికి గురైంది.
పతకంపైనే గురి..
అయితే, టోక్యో ఒలింపిక్స్‌లో కమల్‌ప్రీత్ శక్తిమేరకు పోరాడితే కచ్చితంగా పతకం సాధిస్తుందని బాదల్‌లోని ఆమె కోచ్ రాకీత్యాగి ధీమా వ్యక్తం చేశారు. 2014 నుంచి కమల్ అక్కడే శిక్షణ పొందుతోందని, గతేడాది లాక్‌డౌన్‌లో మానసిక ఆందోళనకు గురైందని రాకీత్యాగీ చెప్పుకొచ్చారు. ఇప్పుడు తాను టోక్యోకు వెళ్లకపోయినా నిత్యం కమల్‌తో మాట్లాడుతున్నానని చెప్పారు. ఒలింపిక్స్‌లో ఆమె పోటీపడటం ఇదే తొలిసారి కావడంతో కాస్త ఆందోళన చెందుతోందని తెలిపారు. ఆమె శక్తిమేరకు పోరాడితే ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం ఖాయమని అభిప్రాయపడ్డారు. కమల్‌ప్రీత్ 66 లేదా 67 మీటర్ల దూరం డిస్కస్‌త్రో చేయగలదని విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా, ఒలింపిక్స్‌లో శనివారం నిర్వహించిన డిస్కస్ త్రో క్వాలిఫయింగ్ ఈవెంట్‌లో కమల్‌ప్రీత్ 64 మీటర్ల మెరుగైన ప్రదర్శనతో ఫైనల్‌కు చేరింది. ఆగస్టు 2న ఆమె తుదిపోరులో తలపడనుంది. అక్కడ టాప్ ముగ్గురిలో నిలిస్తే కచ్చితంగా భారత్‌కు మరో పతకం ఖాయమైనట్టే.
ఇదీ చదవండి:Tokyo Olympics: 100 మీటర్ల పరుగులో థామ్సన్ రికార్డు