టెన్నిస్ అభిమానులకు శుభవార్త. యుఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ యథావిధిగా జరగనుంది. ప్రేక్షకులను అనుమతించకుండా టోర్నీని నిర్వహించేందుకు న్యూయార్క్ గవర్నర్ ఆమోదం లభించింది. అగ్రశ్రేణి ఆటగాళ్ల నుంచి వ్యతిరేకత వస్తోన్నా లీగ్ నిర్వహణకు అమెరికా టెన్నిస్ సంఘం సిద్ధమైంది. ప్రభుత్వ అనుమతి లభిస్తే షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 31 నుంచి టోర్నీ నిర్వహిస్తామని తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో మంగళవారం న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యూమో యుఎస్ ఓపెన్‌కు పచ్చ జెండా ఊపారు. అభిమానులు లేకుండా టోర్నీని నిర్వహించొచ్చని చెప్పారు.
అయితే ఈ టోర్నీకి అగ్రశ్రేణి క్రీడాకారులు ఎంతమంది సిద్ధమవుతారన్నదే ప్రశ్న. గాయం కారణంగా ఫెదరర్ ఇప్పటికే ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ప్రపంచ నం.1 నొవాక్ జకోవిచ్, రఫెల్ నాదల్‌తో పాటు.. మహిళల నం.1 ఆష్ బార్టీ, సిమోనా హలెప్ యుఎస్ ఓపెన్ నిర్వహణపై ఆందోళన వ్యక్తం చేశారు. హలెప్ తాను ఈ టోర్నీ నుంచి వైదొలుగుతున్నట్లు చెప్పింది. మరి మిగతా వారిలో ఎంతమంది పోటీపడతారన్నది చూడాలి. యుఎస్ ఓపెన్ ముగిశాక.. ఫ్రెంచ్ ఓపెన్‌ను కూడా నిర్వహించే అవకాశముంది.