ఓ వైపు కరోనా భయపెడుతున్నా.. అమెరికాలో కేసులు పెరుగుతూనే ఉన్నా.. టెన్నిస్ వినోదానికి రంగం సిద్ధమైంది. ఈ వైరస్ కాలంలో తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీకి తెర లేవనుంది. జనవరిలో ఆస్ట్రేలియన్ ఓపెన్ తర్వాత ఈ సీజన్‌లో జరగుతున్న రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నీ యుఎస్ ఓపెన్.
జూన్‌లో నిర్వహించాల్సిన ఈ టోర్నీ వైరస్ కారణంగా వాయిదా పడి ఇప్పుడు జరుగుతోంది. టోర్నీ సజావుగా సాగేందుకు నిర్వాహకులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అభిమానులను స్టేడియంలోకి అనుమతించట్లేదు. అగ్రశ్రేణి ఆటగాళ్లు ఫెదరర్, డిఫెండింగ్ ఛాంపియన్లు నాదల్, బియాంక, మహిళల ప్రపంచ నంబర్‌వన్ ఆష్లీ బార్టీ, హలెప్ తదితరులు టోర్నీకి దూరమయ్యారు.
పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ జకోవిక్‌కు టైటిల్ చేరే మార్గంలో ఎలాంటి అడ్డంకీ ఉండకపోవచ్ఛు యుఎస్ ఓపెన్‌కు సన్నాహకంగా నిర్వహించిన వెస్టర్న్ అండ్ సదరన్ టోర్నీలో విజేతగా నిలిచిన అతను ఊపుమీదున్నాడు. మార్గరెట్ గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల (24) రికార్డుకు అడుగు దూరంలో ఉన్న సెరెనా విలియమ్స్ ఈ టోర్నీలోనైనా గెలవాలనే పట్టుదలతో ఉంది.