యుఎస్ ఓపెన్‌లో మాజీ నంబర్‌వన్ సెరెనా విలియమ్స్ తొలి అడుగు వేసింది. మహిళల సింగిల్స్ మొదటి రౌండ్లో ఆమె 7-5, 6-3 తేడాతో అమెరికాకే చెందిన క్రిస్టీపై విజయం సాధించింది. మూడో సీడ్ సెరెనాకు తొలి సెట్‌లో ప్రత్యర్థి నుంచి గట్టిపోటీ ఎదురైంది. తొలి రెండు గేమ్‌లు గెలిచిన క్రిస్టీ 2-0 ఆధిక్యం సంపాదించింది. ఆ తర్వాత పుంజుకున్న సెరెనా వరుసగా మూడు గేమ్‌లు గెలిచింది. ఆ తర్వాత క్రిస్టీ మరో గేమ్ గెలవడం వల్ల స్కోరు 3-3తో సమమైంది. అక్కడి నుంచి పోరు మరింత హోరాహోరీగా మారింది. ఆధిపత్యం చేతులు మారుతూ సాగింది. చెరో రెండు గేమ్‌లు గెలవగా.. స్కోరు 5-5తో మరోసారి సమమైంది.
ఈ దశలో పూర్తిస్థాయి ఆటతీరుతో చెలరేగిన సెరెనా వరుసగా రెండు గేమ్‌లు గెలిచి సెట్ సొంతం చేసుకుంది. ఇక రెండో సెట్లో దూకుడు కొనసాగించిన ఆమె.. ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. మ్యాచ్‌లో ఆమె 13 ఏస్‌లు, 28 విన్నర్లు కొట్టింది. మరో మ్యాచ్‌లో వీనస్ 3-6, 5-7తో ముచోవా (చెక్ రిపబ్లిక్) చేతిలో ఓడింది. 40 ఏళ్ల వీనస్.. 25 ఏళ్ల ముచోవా జోరు ముందు నిలవలేకపోయింది. ఎనిమిదేళ్ల విరామం తర్వాత ఆడిన తొలి గ్రాండ్‌స్లామ్ మ్యాచ్‌లో క్లియ్‌స్టర్స్ (బెల్జియం) 6-3, 5-7, 1-6తో అలెగ్జాండ్రోవా (రష్యా) చేతిలో పరాజయం పాలైంది. రెండో సీడ్ కెనిన్ (యుఎస్‌ఏ), అయిదో సీడ్ సబాలెంకా (బెలారస్), ఏడో సీడ్ కీస్ (యుఎస్‌ఏ), కొంటా (బ్రిటన్), స్టీఫెన్స్ (యుఎస్‌ఏ), అజరెంకా (బెలారస్) కూడా రెండో రౌండ్ చేరారు.
మూడో రౌండ్లో కెర్బర్
ఆరో సీడ్ క్విటోవా (చెక్), మాజీ నంబర్‌వన్ కెర్బర్ (జర్మనీ) మూడో రౌండ్లో ప్రవేశించారు. రెండో రౌండ్లో క్విటోవా 7-6 (7/3), 6-2తో కొజ్లోవా (ఉక్రెయిన్)పై నెగ్గగా.. కెర్బర్ 6-3, 7-6 (8/6)తో ఫ్రైడ్‌సమ్ (జర్మనీ)ని ఓడించింది. మార్టిచ్, గ్రచేవా, కొంటావిట్, సస్నోవిచ్ కూడా మూడో రౌండ్లో అడుగుపెట్టారు.
ముర్రే అతి కష్టం మీద
శస్త్రచికిత్సల నుంచి కోలుకుని దాదాపు 20 నెలల తర్వాత తొలి గ్రాండ్‌స్లామ్ ఆడుతున్న మాజీ నంబర్‌వన్ ముర్రే (బ్రిటన్) అతికష్టం మీద తొలి రౌండ్ దాటాడు. అతను 4-6, 4-6, 7-6 (7/5), 7-6 (7/4), 6-4తో నిషియోక (జపాన్)పై గెలుపొందాడు. 4 గంటల 39 నిమిషాల పాటు సుదీర్ఘంగా సాగిన పోరులో.. తొలి రెండు సెట్లు కోల్పోయినప్పటికీ తిరిగి పుంజుకున్న ముర్రే.. తర్వాతి రెండు సెట్లను టైబ్రేకర్‌లో సొంతం చేసుకున్నాడు. చివరి సెట్‌లో అదే జోరు కొనసాగించి విజయం సాధించాడు. మ్యాచ్‌లో అతను 14 ఏస్‌లు, 59 విన్నర్లు కొట్టాడు.
మరోవైపు రెండో సీడ్ థీమ్ (ఆస్ట్రియా) 7-6, 7-6, 6-3తో మునార్ (స్పెయిన్)పై, మూడో సీడ్ మెద్వెదెవ్ (రష్యా) 6-1, 6-2, 6-4తో డెల్బోనిస్ (అర్జెంటీనా)పై, ఆరో సీడ్ బెరెట్టిని (ఇటలీ) 7-6 (7/5), 6-1, 6-4తో సోయిదా (జపాన్)పై గెలిచారు. దిమిత్రోవ్ (బల్గేరియా), రోనిచ్ (కెనడా), బటిస్టా (స్పెయిన్), సిలిచ్ (క్రొయేషియా), కచనోవ్ (రష్యా)లూ ముందంజ వేశారు. పురుషుల డబుల్స్‌లో దివిజ్ శరణ్ జోడీ కథ తొలి రౌండ్లోనే ముగిసింది. దివిజ్, కసిచ్ (సెర్బియా) జంట 4-6, 6-3, 3-6తో కూలోఫ్ (నెదర్లాండ్స్), మెక్టిచ్ (క్రొయేషియా) ద్వయం చేతిలో ఓడిపోయింది.