పెళ్లికి ముందే సానియా మీర్జా టెన్నిస్ కెరీర్ ముగిసిందని చాలా మంది అనుకున్నారు. కానీ పెళ్లి తర్వాత ఆమె కెరీర్ అద్భుతంగా సాగింది. ఎన్నో విజయాలను అందుకుంది. ప్రపంచ నెంబర్‌వన్‌గానూ నిలిచింది. ఆటకు పెళ్లి అడ్డం కాదని నిరూపించింది.. ఇంతలో బిడ్డకు జన్మనివ్వనుందని తెలియగానే.. ఇక మళ్లీ ఆమె రాకెట్ పట్టదనుకున్నారంతా! కానీ, జన్మనిచ్చి, 13 నెలల పాటు కొడుకు ఆలనా పాలనా చూసి.. మాతృత్వపు మాధుర్యాన్ని పూర్తిగా ఆస్వాదించింది. ఇప్పుడు మళ్లీ సై అంటోంది సానియా. తల్లయ్యాక ఆడకూడదా అని ప్రశ్నిస్తోంది.
అంత సులభం కాదు.. కానీ!
తండ్రులు అయ్యాక మగాళ్లు ఆడుతున్నప్పుడు..తల్లులయ్యాక మహిళలు ఎందుకు ఆడకూడదు? పురుషులతో పోలిస్తే మహిళలకు శారీరక ఇబ్బందులు ఎక్కువే. ఎందుకంటే తల్లి అయ్యే క్రమంలో వారి శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి. వాటి నుంచి కోలుకోవడం సులభం కాదు. సెరెనా, అజరెంకా, క్లియసర్స్ ఇలా చాలా మంది అమ్మలుగా మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టి విజయాలు సాధించారు. సాధిస్తున్నారు. నేనూ సాధిస్తా
వాడు నాకు చాలా నేర్పాడు!
నా కొడుకు ఇజహాన్‌కు 13 నెలలు. వాడి వీసా కోసమే ఎదురుచూస్తున్నా.. అది రాగానే ఆస్ట్రేలియా వెళతా. జనవరి రెండో వారంలో జరిగే హోబర్ట్ టెన్నిస్ టోర్నీలో పాల్గొంటా. ప్రస్తుతమైతే నా జీవితం ఇజహాన్ చుట్టూనే తిరుగుతోంది. వాడి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా.. ఇంతకుముందు చీటికీ మాటికీ చిరాకు పడేదాన్ని.. ఇప్పుడు ప్రశాంతంగా ఉంటున్నా. వాడు రోజుకు సుమారు ఓ ఐదొందల సార్లు అమ్మా.. అమ్మా.. అని పిలుస్తుంటాడు. ఆ ఐదొందల సార్లూ ఓపిగ్గా వింటాను. చూశారా! నేను ఎంత మారానో. మరో చిత్రమేంటంటే వాడు ఎన్నిసార్లు అమ్మా అని అన్నా.. అదే తొలి పిలుపులా అనిపిస్తుంది.
అనుకోలేదు మళ్లీ వస్తానని
నాకు సిజేరియన్ జరిగింది. మూడు నెలలు మంచంపైనే ఉన్నాను. మళ్లీ రాకెట్ పడతానని అనుకోలేదు. నిజానికి సెప్టెంబరులోనే పునరాగమనం చేయాలనుకున్నా. శరీరం అంతగా సహకరించలేదు. ఇప్పుడు అంతా సానుకూలంగా ఉంది.
ఆ బెంగ లేదు
కెరీర్‌లో ఎన్నో మధురమైన విజయాలు సాధించాను. గ్రాండ్‌స్లామ్‌లు గెలిచాను. ప్రపంచ నెంబర్ వన్‌గా నిలిచాను. ఇప్పుడిక ఏది నెగ్గినా.. కనీసం ఒక్క సింగిల్స్ మ్యాచ్ గెలిచినా.. అది నాకు బోనస్సే! కాబట్టి రెండో ఇన్నింగ్స్‌లో విఫలమవుతానన్న బెంగ ఏ మాత్రం లేదు.
అదే తొలి మెట్టు అనుకోవాలి
చాలామంది తల్లయ్యాక వృత్తి జీవితాన్ని మూలన పడేస్తారు. ఇది సరికాదు. ఎందుకంటే.. నాలా అమ్మనయ్యాక బరిలోకి దిగిన అథ్లెట్లు చాలా మంది ఉన్నారు. వారి నుంచి చూసి మహిళలు స్ఫూర్తి పొందాలి. బిడ్డకు జన్మనిచ్చినంత మాత్రాన అంతా అయిపోయిందని భావించకూడదు. మరో అందమైన ప్రయాణానికి మాతృత్వాన్ని మహోన్నతమైన వేదికగా భావించి ముందుకు సాగాలి.