టెన్నిస్‌కు వీడ్కోలు పలికిన దిగ్గజ క్రీడాకారిణి మారియా షరపోవాపై.. ప్రపంచ నంబర్ వన్ నొవాక్ జకోవిచ్ స్పందించాడు. ఆమెపై ఉన్న అభిమానాన్ని ఈ సందర్భంగా చాటుకున్నాడు.
''షరపోవా గొప్ప పోరాటయోధురాలు. గత ఐదారేళ్లుగా గాయాలు, శస్త్రచికిత్సలతో ఇబ్బంది పడినా.. అన్నింటినీ మనోధైర్యం, సంకల్పబలంతో ఎదుర్కొంది. టెన్నిస్‌లో ఆమె పోరాటం స్ఫూర్తిదాయకమైనది."
- జొకోవిచ్, టెన్నిస్ క్రీడాకారుడు
19 ఏళ్ల టెన్నిస్ కెరీర్‌కు బుధవారం వీడ్కోలు పలికింది మారియా షరపోవా. 17వ ఏట రాకెట్ పట్టి మైదానంలోకి దిగిన ఈ అమ్మడు.. 32 ఏళ్ల వయసులో ఆటకు గుడ్‌బై చెప్పింది.
ఆట కోసం ఆరేళ్ల వయసులో...
తండ్రి ఆడుతుంటే తొలిసారి టెన్నిస్ కోర్టులో అడుగుపెట్టిన ఆ నాలుగేళ్ల పాప.. ఆరేళ్ల వయసున్నప్పుడు ఆట కోసం అమ్మకు దూరమైంది. ఆ తర్వాత రాకెట్ పట్టి ఎన్నో సంచలనాలు సృష్టించింది. అద్భుతమైన విజయాలతో టీనేజ్‌లోనే ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. మధ్యలో డోపింగ్ వివాదం, ఎప్పట్నుంచో వేధిస్తున్న భుజం నొప్పితో ఆటకు దూరంగా ఉన్నా.. తిరిగి కోర్టులో అడుగుపెట్టింది. కానీ మునుపటి స్థాయిని అందుకోలేక.. తొలిరౌండ్లలోనే ఓడుతుంటే తట్టుకోలేక.. ఆటకు వీడ్కోలు పలికింది. ఇదీ క్లుప్తంగా షరపోవా టెన్నిస్ జీవితం.
17 ఏళ్ల వయసులో సెరెనాపై గెలుపు...
రష్యాలో పుట్టిన షరపోవా.. రాకెట్ పట్టి ఆరేళ్ల వయసులోనే ఫ్లోరిడా (అమెరికా) చేరింది. ఆటలో అత్యుత్తమ శిక్షణ కోసం రెండేళ్లు తల్లికి దూరంగా ఉంది. 13 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ జూనియర్ టెన్నిస్ టోర్నీలో విజేతగా నిలిచింది. పదిహేనేళ్ల వయసులో తొలి డబ్ల్యూటీఏ టోర్నీ ఆడిన షరపోవా.. ఆ తర్వాత ఇక వెనుదిరిగి చూసుకోలేదు.
అప్పటికే వరుసగా రెండు సార్లు టైటిల్ గెలచిన సెరెనాను 2004 వింబుల్డన్ ఫైనల్లో ఓడించి సంచలనం సృష్టించింది 17 ఏళ్ల షరపోవా. ఆ తర్వాతి ఏడాదే ప్రపంచ నంబర్‌వన్‌గా నిలిచింది. 2006లో యుఎస్ ఓపెన్ నెగ్గింది. ఫలితంగా టెన్నిస్ మహిళల సింగిల్స్‌లో తన ఆధిపత్యానికి తెరలేచిందని అంతా భావించారు.
కానీ భుజం గాయం ఆమెను వెనక్కునెట్టింది. రెండేళ్ల పాటు తన స్థాయికి తగ్గ ఆటతీరు ప్రదర్శించలేకపోయింది. 2008లో ఆస్ట్రేలియన్ ఓపెన్ నెగ్గినప్పటికీ తిరిగి భుజం గాయం వేధించడం వల్ల శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. తిరిగి కోలుకున్నామునుపటిలా ఆడలేకపోయింది. ఫామ్ కోసం తంటాలు పడింది. తిరిగి లయ అందుకునేందుకు తీవ్రంగా శ్రమించింది. 2012లో ఫ్రెంచ్ ఓపెన్ గెలిచి కెరీర్ గ్రాండ్‌స్లామ్ పూర్తిచేసింది. తిరిగి నంబర్‌వన్ ర్యాంకునూ దక్కించుకుంది.
లండన్ ఒలింపిక్స్‌లో రజతం గెలిచింది. మళ్లీ గాయం బాధపెట్టినా 2014లో మరోసారి ఫ్రెంచ్ ఓపెన్ గెలిచింది. కానీ 2016లో డోపింగ్ కారణంగా 15 నెలల పాటు నిషేధానికి గురైంది. వేటు తర్వాత తిరిగి కోర్టులో అడుగుపెట్టి డబ్ల్యూటీఏ టైటిల్ గెలిచి ఫామ్‌లోకి వచ్చినట్లే కనిపించింది. అయితే ఆ తర్వాత ఆమె పూర్తిస్థాయి ప్రదర్శన ఇవ్వలేకపోయింది. తిరిగి గాయాలు వెంటపడడం వల్ల ఆట దెబ్బతింది. చివరకు ఆటకే విరామం ప్రకటించింది.
- షరపోవా తండ్రి 700 అమెరికా డాలర్లు మాత్రమే చేతిలో పట్టుకుని ఆమెతో కలిసి ఫ్లోరిడా చేరాడు. వివిధ రకాల పనులు చేస్తూ తన కూతురికి శిక్షణ ఇప్పించాడు.
- ఆరేళ్ల వయసులో షరపోవా ఆట చూసి ముగ్ధురాలైన మార్టినా నవ్రతిలోవా.. తనను ఫ్లోరిడాలోని అకాడమీలో చేర్పించమని వాళ్ల నాన్నను కోరింది.
- 11 ఏళ్ల వయసులోనే నైకీతో ఒప్పందం కుదుర్చుకుంది షరపోవా.
- ఆటతో పాటు మోడలింగ్ అంటే ఇష్టమున్న షరపోవా.. రిటైర్మెంట్ తర్వాత ఆ దిశగా అడుగులు వేసే అవకాశముంది. జేమ్స్‌బాండ్ సినిమాల్లో బాండ్ గర్ల్‌గా నటించడం తనకు ఇష్టమని ఓ సందర్భంలో చెప్పింది.
- షరపోవా రష్యాలో పుట్టినప్పటికీ ఆమె టెన్నిస్ జీవితం అమెరికాలోనే సాగింది. టోర్నీల్లో రష్యా తరపున ప్రాతినిథ్యం వహించినా తనకు అమెరికా పౌరసత్వం ఉంది.
గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు
షరపోవా మొత్తం 5 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలిచింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ (2008), ఫ్రెంచ్ ఓపెన్ (2012, 2014), వింబుల్డన్ (2004), యుఎస్ ఓపెన్ (2006)లలో ఆమె నెగ్గింది.
ఇదీ చూడండి.. శిఖరం నుంచి పాతాళానికి: టెన్నిస్‌కు షరపోవా గుడ్‌బై