కరోనా తర్వాత రాకెట్ పట్టిన అమెరికా టెన్నిస్ ప్లేయర్ సెరెనా విలియమ్స్.. రెండు టోర్నీలైనా ఆడకముందే మళ్లీ బ్రేక్ ఇచ్చింది. గాయం కారణంగా ఇటాలియన్ ఓపెన్‌కు దూరమైనట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 14 నుంచి 21 వరకు ఈ టోర్నీ ప్రేక్షకులు లేకుండా జరగనుంది.
చీలమండ గాయం వల్ల యూఎస్ ఓపెన్ సెమీఫైనల్ మ్యాచ్‌లోనూ ఇబ్బందిపడింది సెరెనా. టోర్నీ ఆసాంతం బాగానే రాణించిన ఈ స్టార్ ప్లేయర్.. సెమీస్‌లో 6-1, 3-6, 3-6 తేడాతో అజరెంక చేతిలో ఓడిపోయింది. ఫలితంగా మార్గరెట్ కోర్ట్(24) పేరిట ఉన్న గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల రికార్డును ఈ ఏడాదీ అందుకోలేకపోయింది. ప్రస్తుతం 23 టైటిళ్లతో తర్వాతి స్థానంలోనే ఉంది సెరెనా.
నాదల్ మళ్లీ..
ప్రపంచ రెండో ర్యాంకర్ రఫేల్ నాదల్ పురుషుల విభాగంలో ఫేవరెట్‌గా బరిలోకి దిగనున్నాడు. ఫిబ్రవరిలో మెక్సికన్ ఓపెన్ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు రాకెట్ పట్టనున్నాడు.
ప్రపంచ ఆరో ర్యాంకర్, 2019 యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేత బియాన్సా ఆండ్రెస్కు కూడా ఈ టోర్నీలో పాల్గొనట్లేదు. యూఎస్ ఓపెన్-2020లో ఫైనల్ చేరిన డొమినిక్ థీమ్, అలెగ్జాండర్ జ్వెరెవ్ కూడా ఇటాలియన్ ఓపెన్‌లో ఆడట్లేదు.