ఇప్పటికే ఒలింపిక్స్ నుంచి తప్పుకొన్న స్టార్ టెన్నిస్ ప్లేయర్ సెరెనా విలియమ్స్.. ఇప్పుడు యూఎస్ ఓపెన్ నుంచి కూడా వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. తొడకండరానికి గాయం కారణంగా.. వైద్యుల సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇన్స్టాగ్రామ్ వేదికగా తెలిపింది.
"వైద్య బృందం సలహా మేరకు యూఎస్ ఓపెన్ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నా. నన్ను తొడకండరాల గాయం వేధిస్తోంది. గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి సమయం పడుతుంది. న్యూయార్క్ ప్రపంచంలోని అత్యంత ఉత్తేజకరమైన నగరాల్లో ఒకటి. ఆడటానికి నాకు ఇష్టమైన ప్రదేశాలలో ఒకటి. అభిమానులకు దూరమవడం బాధ కలిగిస్తుంది. అయితే దూరం నుంచి అందరినీ ఉత్సాహపరుస్తాను. నా శ్రేయస్సు కోరుకునేవారికి కృతజ్ఞతలు. త్వరలోనే కోలుకుని తిరిగి వస్తా"
- సెరెనా విలియమ్స్
మోడ్రన్ టెన్నిస్‌లో ఎక్కువ గ్రాండ్‌స్లామ్‌లు గెలుచుకున్న క్రీడాకారిణి సెరెనా విలియమ్స్. ఇప్పటి వరకు 23 టైటిల్స్ సొంతం చేసుకుంది. అయితే ఆల్‌టైం గ్రాండ్‌స్లామ్‌ల రికార్డు మార్గరెట్ కోర్ట్(24) పేరిట ఉంది. ఎలాగైనా సరే ఆమె రికార్డును సమం చేయాలని రెండేళ్ల నుంచి సెరెనా శ్రమిస్తోంది. కానీ పరిస్థితులు అచ్చిరాకపోవడం, గాయాల బెడదతో కుదరడం లేదు.
ఇదీ చూడండి: Paralympics: టేబుల్ టెన్నిస్ ఓటమితో మొదలు..