భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా చరిత్ర సృష్టించింది. ప్రతిష్టాత్మక ఫెడ్ కప్ హార్ట్ అవార్డు గెలుచుకుంది. ఈ అవార్డు నెగ్గిన భారత తొలి క్రీడాకారిణిగా ఘనత సాధించింది. ఈ నెల 1 నుంచి వారం రోజుల పాటు జరిగిన ఆన్‌లైన్ ఓటింగ్‌లో 16,985 మంది పాల్గొన్నారు. 10,000 పైచిలుకు ఓట్ల (60 శాతానికి పైగా)తో ఆసియా-ఓసియానియా జోన్ నుంచి సానియా విజేతగా నిలిచింది. 2000 అమెరికన్ డాలర్లు (సుమారు రూ.1.50 లక్షలు) నగదు బహుమతి ఆమె సొంతమైంది.
"ఫెడ్ కప్ హార్ట్ అవార్డు సాధించిన భారత తొలి క్రీడాకారిణిగా నిలవడం గౌరవంగా భావిస్తున్నా. ఈ అవార్డు ద్వారా లభించే నగదు బహుమతిని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా అందజేస్తా. కరోనా వైరస్ కారణంగా ప్రపంచం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది" -- సానియా మీర్జా, టెన్నిస్ క్రీడాకారిణి
ఫెడ్ కప్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ సత్తాచాటే క్రీడాకారిణులకు గుర్తింపుగా అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) 2009లో ఈ అవార్డును ప్రారంభించింది.
ఇదీ చూడండి.. 16 ఏళ్లైనా చెరగని లారా 400 పరుగుల రికార్డు