టోక్యో ఒలింపిక్స్‌కు భారత టెన్నిస్ తార సానియా మీర్జా అర్హత సాధించినట్లే! అదేంటి.. గర్భం, ఆ తర్వాత బిడ్డకు జన్మనివ్వడం వల్ల రెండేళ్లకు పైగా ఆటకు దూరంగా ఉన్న ఆమె.. తిరిగి కోర్టులోనే అడుగుపెట్టలేదు కదా.. మరి ఒలింపిక్స్‌కు ఎలా అర్హత సాధించింది? అనే సందేహం రావడం సహజం. అవును.. ఆమె రెండేళ్లుగా ఆడలేదు. అయినప్పటికీ ఒలింపిక్స్ బరిలో దిగే అవకాశం సానియా ముందు నిలిచింది. దానికి కారణం.. ప్రపంచ టెన్నిస్ సమాఖ్య (డబ్ల్యూటీఏ) నిబంధనల్లోని 'ప్రత్యేక ర్యాంకింగ్' విధానమే. ఈ నిబంధనను ఉపయోగించుకుంటే ఆమె నేరుగా ఒలింపిక్స్ ఆడే వీలుంది.
ప్రత్యేక ర్యాంకింగ్ అంటే..?
డబ్ల్యూటీఏ నిబంధనల ప్రకారం గాయాలు లేదా గర్భం కారణంగా క్రీడాకారులు ఆరు నెలల కంటే ఎక్కువ సమయం ఆట నుంచి విరామం తీసుకుంటే.. వాళ్లు 'ప్రత్యేక ర్యాంకింగ్' కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ విధానం ప్రకారం.. క్రీడాకారులు ఆటకు విరామం ప్రకటించకముందు చివరగా టోర్నీ ఆడినపుడు ఏ ర్యాంకింగ్‌లో ఉన్నారో.. ప్రస్తుతం అదే ర్యాంకింగ్ ఆటగాళ్లకు వర్తిస్తుంది. సానియా చివరగా 2017 అక్టోబర్‌లో చైనా ఓపెన్ ఆడినపుడు ఆమె ప్రపంచ డబుల్స్ ర్యాంకు 9. రెండేళ్లకు పైగా ఆటకు దూరంగా ఉన్న ఆమెకు ప్రస్తుతం డబ్ల్యూటీఏ ర్యాంకింగ్ లేదు. అయినా కూడా ప్రస్తుతం సానియా ర్యాంకును తొమ్మిదిగా పరిగణిస్తారు. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మూడేళ్లలోపు జరిగే 12 టోర్నీల్లో లేదా తిరిగి ఆట మొదలెట్టిన ఏడాదిలోపు ఈ ప్రత్యేక ర్యాంకింగ్‌ను వాడుకోవచ్చు.
2018 అక్టోబర్‌లో మగబిడ్డకు జన్మనిచ్చిన సానియా ఈ నెలలోనే తిరిగి కోర్టులో అడుగుపెడతానని చెప్పింది. ఈ ప్రకారం ఎలా చూసుకున్నా ఈ ఏడాది ఒలింపిక్స్‌లో ఆమె బరిలో దిగవచ్చు. ఒలింపిక్స్ అర్హత నిబంధనల ప్రకారం మహిళల డబుల్స్‌లో తొలి పదిలోపు స్థానాల్లో ఉన్న క్రీడాకారిణి.. తమ దేశానికి చెందిన మరో క్రీడాకారిణిని భాగస్వామిగా ఎంచుకొని ఈ మెగా ఈవెంట్లో పోటీపడవచ్చు.
ఇవీ చూడండి.. ఫిట్‌గా ఉంటారా.. జీతంలో కోత పెట్టమంటారా..!