టెన్నిస్ ర్యాంకుల్లో దిగువ స్థాయిలో ఉన్న ఆటగాళ్లను ఆదుకోవాలని 'బిగ్-3' రోజర్ ఫెదరర్, నొవాక్ జకోవిచ్, రఫెల్ నాదల్ నిర్ణయించారు. కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా టెన్నిస్ ఆగిపోవడంతో యువ క్రీడాకారుల్లో నిరాశ అలుముకుంది. ఈ నేపథ్యంలో వారిని ఆర్థికంగా ఆదుకోవాలనేది 'బిగ్-3' ఆలోచన.
"టెన్నిస్ భవిష్యత్ గురించి నేను, రఫా, రోజర్ చాలాసేపు మాట్లాడుకున్నాం. మేం ఏదో రకంగా ఆటకు సాయం చేయాలని నిర్ణయించుకున్నాం. ఇందులో భాగంగా తక్కువ ర్యాంకు ఆటగాళ్లకు తోడ్పాటు అందించనున్నాం. 250 నుంచి 700 లేదా 1000 వరకు ర్యాంకుల్లో ఉన్న ఆటగాళ్లలో ఎక్కువ మందికి స్పాన్సర్ల నుంచి ఎలాంటి మద్దతు లేదు. వారి సంఘాలు కూడా పట్టించుకోవట్లేదు. చాలా మంది ఆటను వదిలేసే ఆలోచనలో ఉన్నారు. ఇలాంటి వారి కోసం ఏటీపీ సాయంతో సహాయనిధిని ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నాం. గ్రాండ్‌స్లామ్ టోర్నీ ద్వారా వచ్చే నగదు బహుమతిలో కొంత భాగాన్ని వీరికి అందిస్తాం. ఒక సీజన్లో టోర్నీలు తక్కువగా ఉంటే మా ప్రైజ్‌మనీలోంచి ఇస్తాం. టెన్నిస్‌కు వీళ్లే మూలం. భవిష్యత్ కూడా." - జకోవిచ్, టెన్నిస్ ఆటగాడు
ఇదీ చూడండి: అన్నార్తుల ఆకలి తీరేదెప్పుడు?