కరోనా నేపథ్యంలో బంద్ అయిన పలు క్రీడాటోర్నీలు.. నెమ్మదిగా ప్రారంభమవుతున్నాయి. ఆటగాళ్లంతా మళ్లీ శిక్షణలో భాగస్వామ్యం అయ్యేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. టెన్నిస్ క్రీడాటోర్నీలు ప్రారంభమైతే... మరింత జోష్‌తో బరిలోకి దిగుతానని స్పష్టం చేశారు భారత దిగ్గజ టెన్నిస్ ప్లేయర్ లియాండర్ పేస్. తన కెరీర్లో ఎనిమిదో ఒలింపిక్స్ ఆడి చరిత్ర సృష్టించాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.
బుధవారం తన 47వ జన్మదిన వేడుకలను సాదాసీదాగా జరుపుకొన్నారు లియాండర్ పేస్. ఈ ఏడాది ఆటకు వీడ్కోలు పలికే ఆలోచనలో ఉన్న తనకు.. కరోనా అడ్డుతగిలిందని అందుకే ప్రణాళికలు మార్చుకుంటున్నట్లు తెలిపారు.
"ఒలింపిక్స్ నిర్వహణ గురించి నేను నిజంగా ఆందోళన చెందుతున్నాను. ఎందుకంటే అది నా చరిత్రకు, వారసత్వానికి సంబంధించింది. టోక్యో ఒలింపిక్స్‌లో నా చివరి ప్రదర్శన చేయాలనుకున్నాను. కానీ, ఈ ఏడాది జరగాల్సిన టోర్నీ వచ్చే ఏడాదికి వాయిదా పడింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలైన పరిస్థితుల్లో ఒలింపిక్స్‌కు స్పాన్సర్ చేయడానికి ఏ కార్పొరేట్ సంస్థ ముందుకొస్తుంది? అయినా ఒలింపిక్స్‌ను నిర్వహించడానికి జపాన్ ప్రభుత్వం ఇప్పటికీ సుముఖత చూపిస్తుంది. ముఖ్యంగా తలుపులు మూసేసి నిర్వహించాలనుకుంటోంది. కానీ, స్టేడియాలన్నీ ఖాళీగా ఉంటే రెవెన్యూ ఎక్కడ నుంచి వస్తుంది. ఇదే మనం ఎదుర్కొవాల్సిన పెద్ద సమస్య".
-లియాండర్ పేస్, భారత టెన్నిస్ ప్లేయర్
2021లో జరగనున్న టోక్యో ఒలింపిక్స్‌లో బరిలోకి దిగితే.. ఎనిమిదిసార్లు ఈ మెగా టోర్నీలో ఆడిన తొలి టెన్నిస్ ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తారు పేస్. కెరీర్లో మొత్తం 54 టైటిల్స్ గెలిచిన ఈ భారత దిగ్గజం.. 18 గ్రాండ్‌స్లామ్ డబుల్స్ ట్రోఫీలు సొంతం చేసుకున్నారు. డెవిస్కప్లో అత్యధిక డబుల్స్ టైటిల్స్(44) నెగ్గిన క్రీడాకారుడిగా పేస్ పేరిటే రికార్డు ఉంది.
ఇదీ చూడండి: ఒలింపిక్స్ రికార్డు పోయినా.. గ్రాండ్‌స్లామ్‌ల శతకం కొడతా!