వింబుల్డన్‌లో రఫెల్ నాదల్‌పై గెలిచిన మ్యాచ్ తనకెంతో ఇష్టమైన మ్యాచ్‌ల్లో ఒకటి అని రోజర్ ఫెదరర్ తెలిపాడు. అతడితో ఆటను ఎప్పుడూ ఆస్వాదిస్తానని మ్యాచ్ అనంతరం చెప్పాడు. శుక్రవారం హోరాహోరీగా సాగిన సెమీస్‌లో రఫాపై 7-6, 1-6, 6-3, 6-4 తేడాతో విజయం సాధించాడు స్విస్ దిగ్గజం.
"రఫాతో ఆడటాన్ని ఎప్పుడూ ఆస్వాదిస్తా. నాకిష్టమైన మ్యాచ్‌ల్లో ఈ మ్యాచ్ ఒకటిగా మిగిలిపోతుంది. ఎందుకంటే అక్కడుంది రఫెల్ నాదల్" -రోజర్ ఫెదరర్, స్విట్జర్లాండ్ ఆటగాడు.
జకోవిచ్‌తో జరగనున్న తుదిపోరు రసవత్తరంగా సాగనుందని జోస్యం చెప్పాడు ఫెదరర్.
"నొవాక్ డిఫెండింగ్ ఛాంపియన్. అతడితో మ్యాచ్ కొంచెం కష్టమైనా... ఓడించడానికి ప్రయత్నిస్తాను. మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది" -రోజర్ ఫెదరర్, స్విట్జర్లాండ్ ఆటగాడు.
మరో సెమీస్‌లో బటిస్టా అగట్‌ను ఓడించి ఆరోసారి వింబుల్డన్ పైనల్‌కు చేరాడు జకోవిచ్.
ఆదివారం వీరిద్దరి మధ్య జరగనున్న ఫైనల్లో గెలిచి 21వ గ్రాండ్‌స్లామ్‌ను సొంతం చేసుకోవాలనుకుంటున్నాడు రోజర్. అలాగే కెరీర్లో 16వ టైటిల్ నెగ్గాలని ఉర్రూతలూగుతున్నాడు జకోవిచ్.
అత్యధిక వయసులో(38) గ్రాండ్‌స్లామ్ ఫైనల్ చేరిన మూడో వ్యక్తిగా రోజర్ రికార్డు సృష్టించాడు. 1974లో కెన్ రోస్వెల్ 39 ఏళ్ల వయసులో వింబుల్డన్, యూఎస్ ఓపెన్ ఫైనల్‌కు చేరాడు.
ఇది చదవండి: 24వ టైటిల్ కోసం ఒకరు.. బోణీ కోసం మరొకరు