వచ్చే ఏడాది జరగనున్న ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో (Australian Open ) తాను పాల్గొనకపోవచ్చని ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు నొవాక్ జకోవిచ్ తెలిపాడు. తాను కరోనా టీకా వేయించుకున్నానా? లేదా చెప్పడానికి ఎప్పటిలాగే నిరాకరించాడు. వచ్చే ఏడాది గ్రాండ్‌స్లామ్ మెల్బోర్న్లో జరగనుంది. అథ్లెట్లందరికి వ్యాక్సినేషన్ తప్పనిసరి చేశారు నిర్వాహకులు. వ్యాక్సిన్ వేయించుకోని వారికి వీసాలు మంజూరు చేయబోమని ఆస్ట్రేలియా అధికార వర్గాలు తెలిపాయి.
"పరిస్థితులు ఇలాగే ఉంటే.. నేను మెల్బోర్న్కు వెళతానో? లేదో? తెలియదు. వ్యాక్సిన్ వేసుకున్నానా? లేదా? నేను చెప్పను. అది నా వ్యక్తిగతం. ఓ వ్యక్తిని ప్రశ్నలు అడిగి.. వారిని అంచనా వేయడం ఈ రోజుల్లో స్వేచ్ఛగా భావిస్తున్నారు. నాకు ఆస్ట్రేలియా గ్రాండ్‌స్లామ్ అంటే చాలా ఇష్టం. ఈ ఏడాది కూడా నిబంధనలు ఎప్పటిలాగే ఉంటాయని అనుకుంటున్నా. మరీ ఎక్కువ మార్పులు ఉంటే.. నేనే ఆడటం సందేహమే."
ఇప్పటివరకు జకోవిచ్ తొమ్మిదిసార్లు ఆస్ట్రేలియా గ్రాండ్‌స్లామ్‌ని సొంతం చేసుకున్నాడు. ఇటీవల జరిగిన యూఎస్ ఓపెన్ ఫైనల్లో నొవాక్ జకోవిచ్(Novak Djokovic US Open) ఓటమిపాలయ్యాడు. ఈ ఏడాది 'క్యాలెండర్ స్లామ్' సాధించి చరిత్ర సృష్టించాలన్న అతని కలకు మెద్వెదెవ్ అడ్డుకట్ట వేశాడు.
ఇదీ చదవండి: T20 World Cup: ఆస్ట్రేలియా నిరీక్షణ ముగిసేనా?