ఫ్రెంచ్ ఓపెన్ ఆరంభ మ్యాచ్‌లోనే అనూహ్య ఫలితం వెలువడింది. ఆదివారం తొలి రౌండ్లో గొఫిన్ 5-7, 0-6, 3-6 తేడాతో జానిక్ సిన్నర్ (ఇటలీ) చేతిలో ఓడాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 74వ స్థానంలో ఉన్న 19 ఏళ్ల సిన్నర్.. 12వ ర్యాంకులో ఉన్న 29 ఏళ్ల గొఫిన్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. తొలి సెట్లో ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసిన సిన్నర్ 4-2తో ఆధిక్యంలోకి వెళ్లాడు. కానీ ఆ తర్వాత గొఫిన్ పుంజుకోవడం వల్ల స్కోరు 5-5తో సమమైంది. ఆ దశలో సిన్నర్ కోర్టులో వేగంగా కదులుతూ.. మెరుపు షాట్లతో వరుసగా రెండు గేమ్‌లు గెలిచి తొలి సెట్ సొంతం చేసుకున్నాడు. ఇక రెండో సెట్లో అతను అనూహ్యంగా చెలరేగాడు. బలమైన సర్వీసులు, ఫోర్‌హ్యాండ్ షాట్లతో సత్తాచాటి ఒక్క గేమ్ కూడా కోల్పోకుండానే సెట్ గెలిచాడు. మూడో సెట్లోనూ అదే జోరు కొనసాగించి విజేతగా నిలిచాడు.
టోర్నీ ఆరంభానికి ముందే ఆసక్తి రేపిన పోరులో 16వ సీడ్ వావ్రింకా (స్విట్జర్లాండ్) 6-1, 6-3, 6-2.. ముర్రే (బ్రిటన్)ను చిత్తు చేశాడు. మరో మ్యాచ్‌లో 25వ సీడ్ డిమినార్ (ఆస్ట్రేలియా) 6-7 (9-11), 4-6, 0-6తో మార్కో (ఇటలీ) చేతిలో పరాజయం పాలయ్యాడు. నిషికోరి (జపాన్), ఇస్నర్, ఫ్రిట్జ్ (యుఎస్‌ఏ) కూడా ముందంజ వేశారు.
సిమోనా జోరు
మహిళల సింగిల్స్‌లో టాప్‌సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా) శుభారంభం చేసింది. తొలి రౌండ్లో ఆమె 6-4, 6-0తో తొర్మో (స్పెయిన్)ను ఓడించింది. టైటిల్ ఫేవరేట్‌గా టోర్నీలో అడుగుపెట్టిన హలెప్ వరుస సెట్లలో ప్రత్యర్థిని చిత్తుచేసి తన పుట్టిన రోజును ఆనందంగా మార్చుకుంది. తొలి సెట్‌లో 2-4తో వెనకబడ్డ తను.. ఆ తర్వాత ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసి.. వరుసగా నాలుగు గేమ్‌లు గెలిచి సెట్ నెగ్గింది. రెండో సెట్లో చెలరేగి ప్రత్యర్థికి ఒక్క సెట్ అయిన గెలిచే అవకాశమివ్వలేదు.
మరో మ్యాచ్‌లో పదో సీడ్ అజరెంక (బెలారస్) 6-1, 6-2తో కొవినిచ్ (మాంటెనిగ్రో)పై, 16వ సీడ్ మార్టిన్స్ (బెల్జియం) 6-2, 6-3తో మార్గరిటా (రష్యా)పై, 20వ సీడ్ సకారి (గ్రీస్) 6-0, 7-5తో తొమ్జనోవిచ్ (ఆస్ట్రేలియా)పై నెగ్గారు. మాజీ నంబర్‌వన్ వీనస్ విలియమ్స్ (అమెరికా) కథ మరోసారి తొలి రౌండ్లోనే ముగిసింది. ఆమె 4-6, 4-6తో అన్నా కరోలిన (స్లోవేకియా) చేతిలో ఓడింది. ఈ ఏడాది ఆమె ఏ గ్రాండ్‌స్లామ్ టోర్నీలోనూ తొలి రౌండ్ దాటలేదు. పదిహేడో సీడ్ కొంటావీట్ (ఈస్తోనియా) 4-6, 6-3, 4-6తో గార్సియా (ఫ్రాన్స్) చేతిలో పరాజయం చెందింది.
అమ్మో చలి..
ఫ్రెంచ్ ఓపెన్ అంటే వేడి, ఉక్కపోతతో ఆ వాతావరణమే వేరేగా ఉండేది. కానీ ఈ ఏడాది కరోనా కారణంగా వాయిదా పడ్డ ఈ టోర్నీ ఎప్పుడూ జరిగే వేసవిలో (మే నుంచి జూన్ మధ్యలో) కాకుండా సెప్టెంబర్‌లో ఆరంభమైంది. ఇప్పుడేమో అక్కడ వర్షాలు కురవడం వల్ల.. ఉష్ణోగ్రతలు కనిష్ఠంగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో చలికి వణికిపోతున్నారు. కొవినిచ్‌తో తొలి రౌండ్ మ్యాచ్ సందర్భంగా వర్షం పడింది. తొలి సెట్‌లో అజరెంక 2-1తో ఆధిక్యంలో ఉన్న సమయంలో.. ‘'జల్లులు తగ్గేదాకా కొన్ని నిమిషాల పాటు కోర్టు బయట కూర్చొండి' అని సూపర్‌వైజర్ వాళ్లను అడిగాడు. దీంతో కోపం తెచ్చుకున్న ఆమె.. ‘"చలికి గడ్డ కట్టుకుపోయేలా ఉన్నా. ఇప్పుడిక్కడ ఎనిమిది డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత ఉంది. నేనుండే ఫ్లోరిడాలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. దానికి అలవాటు పడ్డ నేను ఈ చలిని ఎలా తట్టుకోగలను. ఇక్కడ బాతుల్లాగా కూర్చోవడంలో అర్థం ఏముంది’" అని చెప్పి తన ప్రత్యర్థితో కలిసి లాకర్ గదికి వెళ్లి కూర్చుంది.