ఎప్పుడూ చూస్తున్న దృశ్యాలే.. ఎర్రమట్టిపై అతడి సింహనాదం.. అతడి చేతిలో ఫ్రెంచ్ కప్పు! ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ.. ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేస్తూ.. తన కోటలో రఫెల్ నాదల్ మరోసారి చెలరేగిపోయాడు. 13వ సారి టైటిల్ సొంతం చేసుకుని తన రికార్డును తనే తిరగరాశాడు. ఒకప్పుడు అసాధ్యం అనుకున్న రోజర్ ఫెదరర్ 20 గ్రాండ్‌స్లామ్‌ల రికార్డునూ అందుకుని.. 'ఆల్‌టైమ్ గ్రేట్' కావడానికి అడుగు దూరంలో నిలిచాడు రఫా.
ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ బరిలో తానుంటే.. ఇక ప్రత్యర్థులు పోరాడాల్సింది రన్నరప్ ట్రోఫీ కోసమేనని స్పెయిన్ యోధుడు రఫెల్ నాదల్ మరోసారి చాటాడు. ఆటగాళ్లు ఎంతమంది వచ్చినా.. ఎన్నిసార్లు వచ్చినా.. సింహాసనం తనదేనని రాకెట్ గుద్ది మరీ చెప్పాడు. 34 ఏళ్ల వయసులో మరో టైటిల్‌ను ఖాతాలో వేసుకుని తనలో సత్తా తగ్గలేదని నిరూపించాడు. ఇప్పటికే ఫైనల్ చేరిన ప్రతిసారి అతను విజేతగా నిలిచినప్పటికీ.. ప్రత్యర్థిగా ప్రపంచ నంబర్‌వన్ జకోవిచ్ ఉండడం వల్ల పోరు హోరాహోరీగా సాగుతుందేమోనని అంతా భావించారు. కానీ మ్యాచ్‌లో చివరి సెట్ మినహా జకోను అనామక ఆటగాడిగా మార్చేస్తూ.. చెలరేగిన అతను ఆదివారం, 2 గంటల 41 నిమిషాల పాటు సాగిన టైటిల్ పోరులో 6-0, 6-2, 7-5 తేడాతో విజయం సొంతం చేసుకున్నాడు.
ఆ సెట్ ఒక్కటే:
ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ నాదలే ఫేవరేట్ అనడంలో సందేహం లేదు. అయినప్పటికీ ఈ ఏడాది మంచి ఫామ్‌లో ఉన్న జకోవిచ్ అతనికి పోటీ ఇస్తాడని అంతా అనుకున్నారు. కానీ ఎర్రమట్టి కోర్టు కనిపిస్తే చాలు పూనకం వచ్చినట్లు రెచ్చిపోయే రెండో సీడ్ నాదల్ మ్యాచ్ ఆరంభం నుంచే పూర్తి ఆధిపత్యం చలాయించాడు. తొలి రెండు సెట్లను పెద్దగా కష్టపడకుండానే నెగ్గిన అతనికి.. మూడో సెట్లో టాప్‌సీడ్ జకో నుంచి పోటీ ఎదురైంది. మొదటి సెట్లో ప్రత్యర్థి తొలి సర్వీస్‌ను బ్రేక్ చేసిన అతను దూకుడు మొదలెట్టాడు.వేగవంతమైన సర్వీసులతో రెచ్చిపోయిన నాదల్.. ఒక్క గేమ్ కూడా కోల్పోకుండా తొలి సెట్ సొంతం చేసుకున్నాడు. రెండో సెట్లో తొలి గేమ్ గెలిచిన జకోవిచ్ కోలుకున్నట్లే కనిపించాడు. కానీ నాదల్ అతనికి ఆ అవకాశమే ఇవ్వలేదు. తిరుగులేని ఆటతీరుతో వరుసగా అయిదు గేమ్‌లు నెగ్గి 5-1తో సెట్ పాయింట్ ముందు నిలిచాడు.
ఆ తర్వాత జకో ఓ గేమ్ నెగ్గినప్పటికీ.. అనవసర తప్పిదంతో తర్వాతి గేమ్ చేజార్చుకుని రెండో సెట్ కూడా కోల్పోయాడు. తొలి రెండు సెట్లతో పోలిస్తే మూడో సెట్ కాస్త హోరాహోరీగా సాగింది. 3-3తో స్కోరు సమం కావడంతో ఉత్కంఠ రేగింది. చెరో గేమ్ గెలిచి స్కోరును 4-4కు తీసుకెళ్లారు. ఆ దశలో విన్నర్‌తో సర్వీస్ నిలబెట్టుకున్న జకో 5-4తో గెలుపు దిశగా సాగాడు. కానీ కీలక సమయంలో జకో చేసిన అనవసర తప్పిదాలను అవకాశంగా మలుచుకున్న నాదల్ వరుసగా మూడు గేమ్‌లు గెలిచి సెట్ నెగ్గాడు. ఏస్‌తో మ్యాచ్ ముగించిన అతను ఆనందంతో కోర్టులో మోకాళ్లపై కూర్చుండిపోయాడు. ఈ మ్యాచ్‌లో ఏడుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసిన నాదల్.. 4 ఏస్‌లు, 31 విన్నర్లు కొట్టాడు. 52 అనవసర తప్పిదాలు చేయడం జకోవిచ్‌ను దెబ్బతీసింది.మహిళల డబుల్స్ టైటిల్‌ను బబోస్ (హంగేరీ)- మ్లదనోవిచ్ (ఫ్రాన్స్) జోడీ నిలబెట్టుకుంది. ఈ జంట ఫైనల్లో 6-4, 7-5తో 14వ సీడ్ అలెక్సా (చిలీ)- క్రాజిక్ (అమెరికా)పై విజయం సాధించింది.
"కరోనా కారణంగా ప్రపంచ కఠిన పరిస్థితులను ఎదుర్కొంటోంది. మనందరం కలిసి దానిపై విజయం సాధించగలం. ఫ్రెంచ్ ఓపెన్‌లో గెలవడం నాకన్నింటికంటే ప్రత్యేకమైనది. ఫెదరర్ రికార్డు గురించి ఆలోచించలేదు. మరోసారి ఎర్రమట్టి కోర్టులో గెలవాలని మాత్రమే అనుకున్నాను. నా వాళ్లకు ధన్యవాదాలు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో జకో చేతిలో ఓడా. కానీ ఈరోజు నాది" -నాదల్, ఫ్రెంచ్ ఓపెన్-2020 విజేత
- ఫ్రెంచ్ ఓపెన్ విజయంతో పురుషుల సింగిల్స్‌లో 20వ గ్రాండ్‌స్లామ్ టైటిల్(13 ఫ్రెంచ్ ఓపెన్, 4 యుఎస్ ఓపెన్, 2 వింబుల్డన్, ఒకటి ఆస్ట్రేలియన్ ఓపెన్) సొంతం చేసుకున్న నాదల్.. ఆల్ టైమ్ గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల రికార్డులో ఫెదరర్‌తో పాటు అగ్రస్థానంలో నిలిచాడు. వీరి తర్వాత జకోవిచ్ 17 టైటిళ్లతో ఉన్నాడు.
- నాదల్కు ఇది వరుసగా నాలుగో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్. 2017 నుంచి అతడు విజేతగా నిలుస్తూనే ఉన్నాడు.
- ఫ్రెంచ్ ఓపెన్‌లో నాదల్‌కిది వందో విజయం. ఇప్పటివరకు 102 మ్యాచ్‌లాడి కేవలం రెండింట్లోనే ఓడిపోయాడు. ఈ టోర్నీలో ఒక్క సెట్ కూడా కోల్పోకుండానే విజేతగా నిలిచాడు.