ఎర్రమట్టి కోర్టు రారాజు రఫెల్ నాదల్, తనకు పెట్టని కోట అయిన ఫ్రెంచ్ ఓపెన్‌లో 13వ టైటిల్ వేటకు సిద్ధమయ్యాడు. విజయతీరాలకు చేరాలంటే ప్రపంచ నం.1 జకోవిచ్ రూపంలో కఠిన సవాలు ఎదుర్కొవాల్సిందే. ఈ ఏడాది అద్భుత ఫామ్‌లో ఉన్న జకో.. నాదల్‌ను అడ్డుకుంటాడా? లేదా ఎప్పటిలానే ట్రోఫీకి నాదల్ ముద్దు పెడతాడా? అనేది తేలేది ఆదివారమే(అక్టోబరు 11).
- ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన ప్రతిసారి నాదల్ విజేతగా నిలిచాడు. 2005 నుంచి ఇప్పటివరకు 12 సార్లు టైటిల్ గెలిచాడు.
- ఇప్పటివరకూ నాలుగుసార్లు ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన జకోవిచ్.. ఒక్కసారి (2016) గెలిచాడు. 2012, 2014 ఫైనల్స్‌లో నాదల్ చేతిలోనే ఓడిపోయాడు. ఈ టోర్నీలో 6-1 విజయాలతో జకోపై నాదల్‌దే పైచేయి.
- నాదల్ ఈ ట్రోఫీ గెలిస్తే ఫెదరర్ 20 గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల రికార్డును సమం చేస్తాడు. అతని ఖాతాలో ఇప్పటికే 19 టైటిళ్లున్నాయి. జకోవిచ్ నెగ్గితే అతడి టైటిళ్ల సంఖ్య 18కి చేరుతుంది.
- ఫ్రెంచ్ ఓపెన్‌ను జకోవిచ్ గెలిస్తే ఓపెన్ శకంలో అన్ని గ్రాండ్‌స్లామ్‌లనూ ఒకటి కంటే ఎక్కువ సార్లు గెలిచిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. అయితే క్వార్టర్స్‌లో అతను భుజం నొప్పితో బాధపడటం, సెమీస్‌లో సిట్సిపాస్‌పై 6-3, 6-2, 5-7, 4-6 6-1తో అయిదు సెట్ల పాటు పోరాడి ఫైనల్ చేరడం అతణ్ని ఇబ్బంది పెట్టే విషయాలే.