టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ వింబుల్డన్‌లో కోరీ గాఫ్(అమెరికా) దూసుకెళ్తోంది. 15 ఏళ్ల వయసులోనే మెయిన్ డ్రాకు అర్హత సాధించిన గాఫ్... గురువారం జరిగిన రెండో రౌండ్లో తనకన్నా మెరుగైన రాబ్రీకోవా (స్లొవేకియా)ను 6-3, 6-3తో ఓడించింది. రాబ్రీ ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 313 స్థానంలో ఉంది. 2019లో సెమీఫైనల్ వరకు వెళ్లింది. అంతటి మేటి క్రీడాకారిణిపై గెలిచి సత్తా చాటింది గాఫ్. ఈ విజయంతో 1991 తర్వాత ఈ గ్రాండ్ ఛాంపియన్‌షిప్‌లో 3వ రౌండ్‌కు చేరిన యువ క్రీడాకారిణిగానూ ఘనత సాధించింది. ఈ టోర్నీ తొలి రౌండ్లో 5 సార్లు వింబుల్డన్ ఛాంపియన్ వీనస్ విలియమ్స్‌ను మట్టికరిపించింది కోరీ గాఫ్.
కెర్బర్ ఔట్...
వింబుల్డన్ నుంచి జర్మనీ భామ కెర్బర్ నిష్క్రమించింది. ఈ మాజీ ఛాంపియన్‌కు లారెన్ డేవిస్(అమెరికా) షాకిచ్చింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో కెర్బర్ 6-2, 2-6, 1-6 తేడాతో లారెన్ డేవిస్ చేతిలో ఓడింది.
టాప్‌సీడ్ బార్టీ మూడో రౌండ్లో అడుగుపెట్టింది. ఆమె 6-1, 6-3 తేడాతో యుట్వాక్(బెల్జియం)పై గెలిచింది. అమెరికా తార సెరెనా విలియమ్స్ 2-6, 6-2, 6-2 తేడాతో జువాన్(స్లొవేనియా)పై చెమటోడ్చి గెలిచింది. క్విటోవా(చెక్ రిపబ్లిక్), కొంటా (బ్రిటన్), బెర్టిన్స్(నెదర్లాండ్స్), స్లోన్ స్టీఫెన్స్(అమెరికా) మూడో రౌండ్ చేరారు.