ఆస్ట్రేలియన్ ఓపెన్ క్వాలిఫయర్స్ పూర్తయింది. ఫిబ్రవరి 8 నుంచి ప్రారంభమయ్యే సింగిల్స్ మెయిన్ డ్రాలో పోటీ పడేందుకు 16 మంది పురుషులు, 16 మంది మహిళా ప్లేయర్లు అర్హత సాధించారు. ప్రత్యేక విమానంలో ఆస్ట్రేలియాకు చేరుకున్న వీరందరూ, 14 రోజులు క్వారంటైన్లో ఉండనున్నారు. అనంతరం కరోనా నిర్ధరణ పరీక్షల్లో నెగటివ్‌గా తేలితేనే టోర్నీలో పాల్గొంటారు.
మెయిన్ డ్రాలో పాల్గొనే ఆటగాళ్లతో పాటు అర్హత టోర్నీలో చివరిదాకా పోరాడి ఓడిన మరో ఆరుగురు పురుషులు, ఆరుగులు మహిళా ప్లేయర్లు ఇప్పటికే ఆస్ట్రేలియాకు చేరుకున్నారు. వీరందరూ క్వారంటైన్లో ఉంటారు. టోర్నీలో పాల్గొనే ఆటగాళ్లు గాయాలు లేదా ఇతర కారణాల వల్ల తప్పుకుంటే ఆ స్థానాల్లో వీళ్లు ఆడే అవకాశముంటుంది.
ఈ టోర్నీలో ర్యాంకింగ్స్ ఆధారంగా నేరుగా 104 మంది ఆటగాళ్లు, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్, క్వాలిఫయర్స్‌లో అర్హత సాధించిన వారు పోటీపడనున్నారు.
కరోనా పాజిటివ్
టోర్నీ ప్రారంభానికి ముందు చేసిన వైద్య పరీక్షల్లో మాజీ ప్రపంచ నంబర్ వన్ ఆండీ ముర్రే కరోనా బారినపడ్డాడు. దీంతో అతడు ఆడేది సందేహంగా మారింది. విమానంలో ఆస్ట్రేలియా వెళ్లాల్సిన ముర్రే.. వైరస్ సోకడం వల్ల లండన్‌లోని తన ఇంట్లో ఐసోలేషన్‌లో ఉన్నాడు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం బాగానే ఉన్నట్లు తెలిసింది.
ఇదీ చూడండి: ఆరోసారి నిరాశే.. క్వాలిఫయర్స్‌లో అంకిత ఓటమి