టీ20 ప్రపంచకప్‌లో (T20 World Cup 2021) వరుస ఓటములతో విమర్శలు ఎదుర్కొంటున్న టీమ్ఇండియాకు మద్దతుగా నిలిచాడు ఇంగ్లాండ్ మాజీ బ్యాటర్ కెవిన్ పీటర్సన్ (Kevin Pietersen News). క్రీడాకారులు రోబోలు కారని, వారికి ఎల్లప్పుడూ అభిమానుల మద్దతు అవసరమని చెప్పాడు.
టైటిల్ ఫేవరెట్లుగా బరిలోకి దిగిన భారత్.. తొలి మ్యాచ్‌లోనే పాకిస్థాన్ (Ind Vs Pak) చేతిలో 10 వికెట్ల తేడాతో ఘోర పరాభవం చవిచూసింది. అనంతరం న్యూజిలాండ్‌తో (India vs New Zealand) 8 వికెట్ల తేడాతో ఓడింది. దీంతో గ్రూప్ 2లో 5వ స్థానంలో కొనసాగుతోంది. టోర్నీలో టీమ్ఇండియా ముందుకు వెళ్లాలంటే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన దుస్థితి ఏర్పడింది.
ఇంతటి అనూహ్య పేలవ ప్రదర్శనను అభిమానులే జీర్ణించుకోలేకపోతున్నారు. జట్టుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే పీటర్సన్ మాత్రం టీమ్ఇండియాకు (Kevin Pietersen Tweet on Team India) దన్నుగా నిలిచాడు.
"క్రీడల్లో ఒకరు గెలుస్తారు. మరొకరు ఓడిపోతారు. ఏ ఆటగాడూ ఓడిపోవాలని బరిలోకి దిగడు. దేశానికి ప్రాతినిధ్యం వహించడం అన్నింటికన్నా పెద్ద గౌరవం. క్రీడాకారులు రోబోలు కాదని అర్థం చేసుకోవాలి. వారికి ఎల్లవేళలా మద్దతు అవసరం."
-కెవిన్ పీటర్సన్, ఇంగ్లాండ్ మాజీ బ్యాటర్
న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో ఓపెనింగ్‌లో రావాల్సిన రోహిత్ శర్మను (Rohit Sharma News) వన్ డౌన్లో పంపడం సహా బ్యాటింగ్ ఆర్డర్లో కోహ్లీ చేసిన మార్పులను ఎందరో మాజీలు ప్రశ్నించారు. బ్యాటర్ల షాట్ల ఎంపిక కూడా పేలవంగా ఉందని విమర్శించారు.
ఎక్కువ బాధపడేది వారే..
అయితే టీమ్ఇండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ (Harbhajan Singh News).. ఆటగాళ్ల పట్ల కఠినంగా వ్యవహరించకూడని అన్నాడు. "గొప్ప ఆటకు భారత క్రికెటర్లు పెట్టింది పేరు. ఓడిపోయినప్పుడు అందరి కన్నా ఎక్కువగా బాధపడేది ఆటగాళ్లే." అని భజ్జీ అన్నాడు. న్యూజిలాండ్ గొప్పగా ఆడిందని చెప్పాడు.
ఇదీ చూడండి: టీమ్ఇండియా బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు.. మాజీల విమర్శలు!