భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ జరపనున్న పర్యవేక్షక కమిటీకి బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ నాయకత్వం వహిస్తున్నారు. ఈ కమిటీ ఏర్పాటుపై రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, బజ్‌రంగ్ పునియా అసంతృప్తి వ్యక్తం చేశారు. తమను సంప్రదించకుండా దీనిని ఏర్పాటు చేశారని ట్విటర్ వేదికగా స్పందించారు.
'పర్యవేక్షక కమిటీని ఏర్పాటు చేసే ముందు మమ్మల్ని సంప్రదిస్తామని హామీ ఇచ్చారు. కానీ అలా జరగకపోవడం బాధాకరం' అని వినేశ్ ట్వీట్ చేశారు. అలాగే ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా, క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌ను ట్యాగ్ చేశారు. బజ్‌రంగ్ పునియా కూడా ఇదేవిధంగా ట్వీట్ చేశారు.
ప్రభుత్వం నియమించిన ఈ కమిటీ వచ్చే నెల రోజుల పాటు జాతీయ సమాఖ్య దైనందిన వ్యవహారాలు కూడా చూస్తుంది. రెజ్లర్ యోగేశ్వర్ దత్, మాజీ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి తృప్తి ముర్గుండె, టాప్స్ మాజీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి రాజగోపాలన్, సాయ్ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాధిక శ్రీమాన్ కమిటీలోని ఇతర సభ్యులు. బ్రిజ్ భూషణ్‌పై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపేందుకు భారత ఒలింపిక్ సంఘం ఏర్పాటు చేసిన కమిటీలో కూడా యోగేశ్వర్, మేరీకోమ్ సభ్యులుగా ఉన్న సంగతి తెలిసిందే.