Ranking Series Wrestling 2023 : భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్.. హంగరీ రాజధాని బుడాపెస్ట్ వేదికగా జరుగుతున్న ర్యాంకింగ్ సిరీస్ టోర్నీ నుంచి వైదొలిగినట్లు తెలుస్తోంది. జ్వరం, ఫుడ్ పాయిజనింగ్ వల్ల అస్వస్థతకు గురైనట్లు సమాచారం. ఈ కారణంగా శుక్రవారం టోర్నీ నుంచి వైదొలగాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ర్యాంకింగ్ సిరీస్ టోర్నమెంట్ గురువారం నుంచి ప్రారంభమైంది. ఈ టోర్నీ 55 కేజీల విభాగంలో శనివారం వినేశ్ ఫొగాట్ తలపడాల్సి ఉంది. కానీ దానికి ముందే వైదొలుగుతున్నట్లు నిర్వాహకులు, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా- ఎస్ఏపీకి ఆమె సమాచారం అందించినట్లు సమాచారం.
వినేశ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ నోటీసులు..
అంతకుముందు వినేశ్ ఫొగాట్‌కు జాతీయ యాంటీ-డోపింగ్ ఏజెన్సీ నోటీసులు జారీ చేసింది. డోపింగ్ నిరోధక నియమాలను పాటించడంలో వినేశ్ విఫలమైనట్లు స్పష్టంగా తెలుస్తుందని ఆ నోటీసుల్లో పేర్కొంది. 'మా రిజిస్టర్డ్ టెస్టింగ్ పూల్‌లో మీ పేరును చేర్చినట్లు 2022 మార్చి, 2022 డిసెంబరులో మీకు ఈ-మెయిల్ చేశాం. దీంతో, యాంటీ డోపింగ్ నిబంధనల కింద ప్రతి త్రైమాసికానికి ముందు మీరు ఎక్కడున్నారన్న విషయాన్ని ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఆ సమయంలో మీరు ఏ రోజు ఎక్కడుంటారన్న స్పష్టమైన సమాచారాన్ని కూడా మాకు అందించాల్సి ఉంటుంది' అని తెలిపింది.
'మీరు చెప్పిన ప్రదేశంలో చెప్పిన సమయానికి డోపింగ్ పరీక్షలకు అందుబాటులో ఉండాలి. మీరు ఇటీవల ఇచ్చిన ఫైలింగ్‌లో జూన్ 27న ఉదయం 10 గంటలకు హరియాణాలోని సోనిపత్‌లో టెస్టింగ్‌కు అందుబాటులో ఉంటారని ప్రకటించారు. దీంతో మీరు చెప్పిన సమయానికి మేము డోపింగ్ కంట్రోల్ ఆఫీసర్లను అక్కడకు పంపించాము. కానీ, ఆ రోజు చెప్పిన సమయానికి ఆ ప్రాంతంలో మీరు లేరు. దీంతో డీసీవో అధికారులు టెస్టింగ్ చేయలేకపోయారు. దీన్ని బట్టి చూస్తే మీరు నిబంధనలను ఉల్లంఘించినట్లు స్పష్టమవుతోంది" అని ఆ నోటీసుల్లో యాంటీ డోపింగ్ ఏజెన్సీ పేర్కొంది. ఈ నోటీసులకు 14 రోజుల్లోపు రిప్లై ఇవ్వాల్సిందిగా ఏజెన్సీ.. వినేశ్ ఫొగాట్‌ను ఆదేశించింది. నిబంధనలను ఉల్లంఘించినట్లు అంగీకరించాలని.. చెప్పిన ప్రాంతంలో ఎందుకు లేరో వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది.
Vinesh Phogat Wrestler Protest : రెజ్లింగ్ సమాఖ్య తాత్కాలిక అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ ఇటీవల రెజర్లు చేపట్టిన ఆందోళనలో వినేశ్ ఫొగాట్ కీలకంగా పాల్గొంది. ఈ సమయంలో నోటీసులు రావడం, తాజాగా టోర్నమెంట్ నుంచి వైదొలగడం వంటి సంఘటనలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.