ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు(wrestling world championship 2021) భారత రెజ్లర్లను ఎంపిక చేసేందుకు సెలక్షన్ ట్రయల్స్ జరుగుతున్నాయి.. 57 కేజీల విభాగం ఫైనల్లో గెలిచి ఆ టోర్నీలో పోటీపడే అవకాశాన్ని ఓ అమ్మాయి దక్కించుకుంది. ఆ సమయంలో ఏ రెజ్లర్ అయినా సంతోషంలో మునిగిపోతారు. కానీ ఆమె మాత్రం బాధతో కన్నీళ్లు పెట్టుకుంది. అప్పటికే ఆమె మోచేతికి అయిన గాయం ఆ ఫైనల్ మ్యాచ్ తర్వాత మరింత తీవ్రమైంది. చీలిక వచ్చిందని.. ప్రపంచ ఛాంపియన్‌షిప్ నుంచి తప్పుకోవాలని వైద్యులు సూచించారు. కానీ ఆమె పోరాటాన్నే నమ్ముకుని చరిత్ర సృష్టించింది. ఆమెనే.. 20 ఏళ్ల అన్షు మలిక్(Anshu Malik News). పట్టుబట్టి పోటీల్లో అడుగుపెట్టిన ఆమె.. ప్రత్యర్థుల పట్టు పట్టి ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో(wrestling world championship) రజతం సొంతం చేసుకుని మరే భారత మహిళకు ఇప్పటివరకూ సాధ్యం కాని రికార్డును అందుకుంది.
అన్షుకు కొత్తేమీ కాదు
అంచనాలను తలకిందులు చేయడం.. సంచలనాలు సృష్టించడం.. పోరాట పటిమతో సవాళ్లకు ఎదురీదడం.. అడ్డంకులను అధిగమించడం అన్షుకు కొత్తేమీ కాదు. హరియాణాకు చెందిన ఈ చిన్నది పిన్న వయసులోనే ఎన్నో ఘనతలు సొంతం చేసుకుంది. ఆమె రక్తంలోనే రెజ్లింగ్ ఉంది. తన తండ్రి ధరమ్‌వీర్ మాలిక్ ఒకప్పటి అంతర్జాతీయ రెజ్లర్. తన తనయుడు శుభమ్‌కు శిక్షణ ఇప్పించడం మొదలెట్టాడు. ఓ సారి సోదరుడితో కలిసి ఆ శిక్షణ కేంద్రానికి వెళ్లిన అన్షు.. అప్పుడే రెజ్లింగ్‌తో ప్రేమలో పడింది. సోదరుడితో కలిసి పోటీపడడంతో తన కెరీర్‌ను చిన్నతనంలోనే ప్రారంభించిన ఆమె ఆటలో వేగంగా ఎదిగింది. జాతీయ స్థాయిలో సత్తాచాటింది. జూనియర్ స్థాయిలోనూ ప్రపంచ వేదికలపై గొప్ప ప్రదర్శన చేసింది. 16 ఏళ్లకే ప్రపంచ క్యాడెట్ ఛాంపియన్‌షిప్స్‌లో పసిడి గెలిచి సంచలనం సృష్టించింది. 2018లో ప్రపంచ జూనియర్ ఛాంపియన్‌షిప్స్‌లో రజతం నెగ్గింది. 2019 ఆసియా జూనియర్ ఛాంపియన్‌గా నిలిచింది. ఏడాదిన్నర క్రితం సీనియర్ స్థాయిలో అడుగుపెట్టిన ఆమె.. తన తొలి టోర్నీలోనే 2019 ప్రపంచ ఛాంపియన్‌కు షాకిచ్చింది. వివిధ క్రీడల్లో జూనియర్ స్థాయిలో సత్తాచాటిన ప్లేయర్లు.. సీనియర్ స్థాయిలో ఉండే పోటీని తట్టుకోలేక.. తమ సామర్థ్యాన్ని పెంచుకోలేక ఇబ్బందులు పడుతుంటారు. కానీ అన్షు మాత్రం సీనియర్ స్థాయిలోనూ అదరగొడుతోంది. ఈ ఏడాది ఆసియా ఛాంపియన్‌గా నిలిచిన ఆమె.. గతేడాది బెల్‌గ్రేడ్ ప్రపంచకప్‌లో రజతం నెగ్గింది.
నిరాశను వదిలి.. గాయాన్ని దాటి
సీనియర్ స్థాయిలో తన ప్రదర్శనతో 19 ఏళ్లకే అన్షు టోక్యో ఒలింపిక్స్ బెర్తు దక్కించుకుంది. ఒలింపిక్స్‌కు సిద్ధమవుతున్న దశలో తండ్రికి కరోనా సోకింది. దీంతో ఆమె కొన్ని రోజులు హోటల్ గదిలో ఉండి సాధన చేయాల్సి వచ్చింది. ఇక టోక్యోలో అడుగుపెట్టిన తర్వాత తొలి మ్యాచ్‌లోనే ఆమెకు మోచేతి గాయమైనప్పటికీ పోరాడి ఓడింది. కానీ అక్కడితోనే ఆగిపోవాలనుకోలేదు. ఒలింపిక్స్‌లో సాధించలేనిది ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో సొంతం చేసుకోవాలనే లక్ష్యంగా పెట్టుకుంది. ట్రయల్స్ సమయంలో గాయం తీవ్రత ఎక్కువైనా భరించింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధించింది. అంతేకాదు గాయం ఇబ్బంది పెట్టినా వెరవకుండా ఈ టోర్నీలో సత్తా చాటి రజతంతో చరిత్ర సృష్టించింది.
ఇదీ చదవండి: