కామన్‌వెల్త్ 2022 పతక విజేత, భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ షాకింగ్ కామెంట్స్ చేశారు. క్వాలిఫికేషన్ రౌండ్లో మంగోలియా రెజ్లర్ ఖులాన్ బత్కుయాగ్ చేతిలో పరాజయం పాలైన ఆమె.. ఆ తరువాత అనూహ్యంగా కాంస్య పతకం సాధించి అందరి ప్రశంసలు అందుకున్నారు. అయితే తాను ఓటమిపాలైనప్పుడు తనపై వచ్చిన విమర్శలను తాజాగా వినేశ్ తీవ్రంగా తప్పుపట్టారు.
ట్విట్టర్ వేదికగా ఆమె పంచుకున్న సుదీర్ఘమైన పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. 'తాపీగా ఇంట్లో కూర్చుని విమర్శలు చేయడమనే సంప్రదాయం ఒక్క ఇండియాలోనే ఉందా లేక ఇతర దేశాల్లోనూ ఇలాగే ఉంటుందా నాకు తెలియదు. అథ్లెట్ అయినంత మాత్రాన ప్రతి టోర్నమెంట్‌కు మేము రోబోల్లాగా పనిచేయాలని లేదు. మేమూ మనుషులమే. కష్టనష్టాలకు ఏ వ్యక్తీ అతీతులు కాదు. మ్యాచ్ అనేది చూసేవారికి ఒకరోజు కాలక్షేపం మాత్రమే. కానీ కొందరు చేసే విమర్శలు మమ్మల్ని ఎంతలా కిందకు లాగేస్తాయో వారికి అర్థం కాదు. ఇప్పటికైనా మీ వ్యాఖ్యలపై మరింత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారని ఆశిస్తున్నా. భారత క్రీడాకారులను చూసే దృక్కోణం మారాలి. నిరంతరం విమర్శించడమే పనిగా పెట్టుకోకుండా వారు ఎంత గొప్పగా ప్రయత్నిస్తున్నారో గుర్తించండి 'అంటూ ఆమె పోస్ట్ చేశారు. ఇటువంటి సంస్కృతికి చరమగీతం పాడాలంటూ ఆమె తోటి క్రీడాకారులకు పిలుపునిచ్చారు.
ఇదీ చూడండి: IND VS AUS : టీమ్ ఇండియాకు అదే అతిపెద్ద సమస్య.. ఆ ఇద్దరిలో చోటు ఎవరికో?