కరోనా కారణంగా అర్థిక ఇబ్బందులు ఏర్పడటం వల్ల భారత స్ప్రింటర్ ద్యుతి చంద్ ఇటీవలే తన బీఎమ్‌డబ్ల్యూ-3 సిరీస్ మోడల్ కారును అమ్మేసినట్లు అనేక వార్తలొచ్చాయి. ఈ విషయంపై స్పందించిన క్రీడాకారిణి.. వాహన నిర్వహణ వ్యయం అధికంగా ఉండటం వల్లే అమ్మకానికి పెట్టినట్లు స్పష్టం చేసింది. తనెప్పుడూ శిక్షణ కోసం ఈ కారును విక్రయిస్తున్నట్లు చెప్పలేదని వెల్లడించింది.
కొద్ది రోజుల క్రితం తన బీఎమ్‌డబ్ల్యూ కారును అమ్మేస్తున్నట్లు ట్విట్టర్లో పోస్ట్ చేసింది ద్యుతి. ఆ తర్వాత డిలీట్ చేసినప్పటికీ.. క్షణాల్లో ఈ పోస్టు వైరల్ అయ్యింది. అనేక మంది క్రీడా ప్రముఖులు, రాజకీయ నాయకులు స్పందించి ఆమెకు అండగా ఉండేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
అయితే, కారు అమ్మిన డబ్బును శిక్షణకోసం మళ్లించే అవకాశం ఉందని పేర్కొంది. ప్రస్తుతం ఒడిశా ప్రభుత్వం, కేఐఐటీ విశ్వవిద్యాలయం తనకు మద్దతుగా ఉన్నట్లు ద్యుతి వెల్లడించింది. కానీ ఒలింపిక్స్‌కు తీసుకునే శిక్షణ ఎంతో ఖరీదైనదని ఉద్ఘాటించింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నగదు పొందాక.. కరోనా పరిస్థితులు మెరుగుపడిన అనంతరం కారును తిరిగి కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించింది.