వెర్టికల్ వరల్డ్ సర్క్యూట్.. ఇదో వినూత్న మారథాన్. దక్షిణ కొరియాలోని సియోల్‌లో జరిగిన ఈ స్కైరన్ అత్యంత ఎత్తయినది. 500 మీటర్ల ఎత్తయిన టవర్, 123 అంతస్తులు, 2,917 మెట్లు ఎక్కి ఈ మారథాన్‌ను పూర్తి చేయాలి. ఈ సీజన్లో మొత్తం 1,660 మంది రేసర్లు పాల్గొన్నారు.
పొలాండ్‌కు చెందిన లొబొజిన్స్కీ ఈ సీజన్లో విజేతగా నిలిచాడు. ప్రపంచంలో మూడో ఎత్తయిన టవర్‌ను 15 నిమిషాల 3 సెకన్లలో అధిరోహించి ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియాకు చెందిన మార్క్ బోర్న్ (15 నిమిషాల 53 సెకన్లు) పేరిట ఉండేది.
ఈ సీజన్లో మాజీ ఛాంపియన్ మార్క్ బోర్న్ 15 నిమిషాల 39 సెకన్స్‌లో రేస్ పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచాడు.
మహిళల రేస్‌లో కొరియా రేసర్ జి యూన్ కిమ్ 19 నిమిషాల 5 సెకన్లలో రేసు పూర్తి చేసి మొదటి స్థానంలో నిలిచింది. సుజి వాల్షమ్, యురి యోషిజుమి రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.
వీడబ్ల్యూసీ ప్రారంభమైనప్పటి నుంచి ఇది 10వ సిరీస్. ఈ ఏడాది మొత్తం 11 రేస్ లు జరిగాయి. తర్వాతి పోటీ ఏప్రిల్ 14న ఇటలీలోని మిలాన్ లో జరగనుంది. ఫైనల్ హాంగ్ కాంగ్ లో జరుగుతుంది.