కరోనా వైరస్‌తో సంబంధం లేకుండా 2021 జులై 23నే టోక్యో ఒలింపిక్స్ ప్రారంభమవుతాయని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐఓసీ) వైస్ ప్రెసిడెంట్ జాన్ కోట్స్ స్పష్టం చేశారు. కరోనా మహమ్మారి విజృంభణ కారణంగా 2020లో జరగాల్సిన ఒలింపిక్ క్రీడలు వాయిదా పడ్డాయి. దీనిపై కోట్స్ సోమవారం ఓ మీడియా సంస్థతో మాట్లాడారు. ఈ క్రీడల్ని సవరించిన తేదీల్లోనే యథావిధిగా నిర్వహిస్తామని వెల్లడించారు.
"కరోనా ఉన్నా, అదృశ్యమైనా ఒలింపిక్ క్రీడలు జరుగుతాయి. జులై 23న ఇవి ప్రారంభం అవుతాయి. సునామీ వినాశనం తర్వాత పునర్నిర్మాణ క్రీడలు అనే థీమ్‌తో ముందుకెళ్తున్నాం. ఇవి కొవిడ్‌ను జయించే క్రీడలు కానున్నాయి. చీకట్లను తరిమికొట్టే వెలుగుకు దగ్గర్లో ఉన్నాం."
-జాన్ కోట్స్, ఐఓసీ వైస్ ప్రెసిడెంట్
2011లో భూకంపం, సునామీ జపాన్‌లో అల్లకల్లోలం సృష్టించాయి. ఆ విపత్తు నుంచి కోలుకుని ఈ అంతర్జాతీయ క్రీడలకు ఆ దేశం సిద్ధంగా ఉందని ఈ థీమ్ అర్థం.
కాగా, విదేశీ సందర్శకుల ప్రయాణాలపై జపాన్ ఇంకా ఆంక్షలు కొనసాగిస్తోంది. వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి ఎంత సమయం పడుతుందో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఈ తరుణంలో క్రీడల నిర్వహణ సాధ్యమేనా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.