1988 సియోల్ ఒలింపిక్స్(Olympics) నుంచి ఆర్చరీలో(Archery) పతకం కోసం భారత దండయాత్ర మొదలైంది. అప్పటి నుంచి ఈ విశ్వ క్రీడలు వస్తున్నాయి.. పోతున్నాయి. కానీ బాణం గురి మాత్రం కుదరలేదు. ఇప్పటివరకు ఏడు ఒలింపిక్స్‌ల్లో ఒక్క పతకం కూడా దక్కలేదు. ఈసారి టోక్యోలో కచ్చితంగా పతకం వస్తుందనే అంచనాలున్నాయి. మన ఆర్చరీ బృందం పటిష్ఠంగా ఉండడమే కారణం. నలుగురు ఆర్చర్లు మొత్తం నాలుగు విభాగాల్లో పతకాల కోసం బరిలో దిగనున్నారు. రికర్వ్ ఆర్చరీ మహిళల వ్యక్తిగత విభాగంలో దీపిక కుమారి(Deepika Kumari), పురుషుల వ్యక్తిగత విభాగంలో అతాను దాసు, ప్రవీణ్ జాదవ్, తరుణ్‌దీప్ తలపడనుండగా.. పురుషుల జట్టుతో పాటు మిక్స్‌డ్ టీమ్‌లోనూ మన ఆర్చర్లు అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
వీళ్లపైనా అంచనాలు
మూడోసారి ఒలింపిక్స్‌లో ఆడబోతున్న వెటరన్ ఆర్చర్, 37 ఏళ్ల తరుణ్‌దీప్ తన కెరీర్‌కు ఘనంగా ముగింపు పలకాలనే ధ్యేయంతో ఉన్నాడు. సెలక్షన్ ట్రయల్స్‌లో అతాను, ప్రవీణ్ తర్వాత మూడో స్థానంలో నిలిచి టోక్యో విమానం ఎక్కే అవకాశం కొట్టేసిన అతను.. ఇప్పటికే రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రజతాలు గెలవడం సహా రెండు ఆసియా క్రీడల పతకాలూ ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు రెండోసారి ఒలింపిక్స్‌లో అడుగుపెట్టబోతున్న దేశంలోని అగ్రశ్రేణి ఆర్చర్లలో ఒకడైన 29 ఏళ్ల అతాను పతకంపై ఆశలు రేకెత్తిస్తున్నాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 9వ స్థానంలో ఉన్న అతను పారిస్ ప్రపంచకప్ టోర్నీలో స్వర్ణంతో గొప్ప ఫామ్‌లో ఉన్నాడు. పదేళ్ల క్రితం వరకూ ఆర్చరీ అంటేనే ఏమిటో తెలీని 25 ఏళ్ల ప్రవీణ్ ఇప్పుడు ఒలింపిక్స్ అరంగేట్రం చేయనున్నాడు. వ్యక్తిగత విభాగంలో వేర్వేరుగా పోటీపడే ఈ ముగ్గురు ఆర్చర్లు.. పురుషుల జట్టు విభాగంలో కలిసికట్టుగా దేశానికి పతకం అందించే దిశగా సాగాలనే పట్టుదలతో ఉన్నారు.
ఆశలన్నీ దీపికపై
ఒలింపిక్స్‌లో భారత్ ఆశలన్నీ మహిళల వ్యక్తిగత విభాగంలో పోటీపడుతున్న ప్రపంచ నంబర్‌వన్ దీపిక కుమారిపైనే. ముచ్చటగా మూడోసారి ఒలింపిక్స్‌లో ప్రాతినిథ్యం వహించబోతున్న 27 ఏళ్ల దీపిక.. గత వైఫల్యాలను పక్కనపెట్టి ఈ సారి విశ్వ క్రీడల్లో పతకంతో తిరిగి రావాలనే దృఢ నిశ్చయంతో ఉంది. ఒలింపిక్స్‌కు ముందు ఆమె అద్భుత ఫామ్‌లో ఉండడం కలిసొచ్చే అంశం. ఇటీవల పారిస్‌లో జరిగిన ప్రపంచకప్ మూడో అంచె పోటీల్లో తిరుగులేని ప్రదర్శన చేసిన తను మూడు స్వర్ణాలను ఖాతాలో వేసుకుంది. వ్యక్తిగత విభాగంతో పాటు మహిళల జట్టు, మిక్స్‌డ్ టీమ్‌లోనూ పసిడిని ముద్దాడింది. ఈ ప్రదర్శనతో తిరిగి నంబర్‌వన్ ర్యాంకును సాధించింది. ఒలింపిక్స్‌లో తొలిసారి ప్రవేశపెట్టిన మిక్స్‌డ్ టీమ్ విభాగంలోనూ భారత్‌కు పతక అవకాశాలున్నాయి. ఈ విభాగంలో తన భర్త అతాను దాస్‌తో కలిసి దీపిక పోటీపడే అవకాశం ఉంది. ఈ ఆర్చరీ దంపతులు పారిస్ ప్రపంచకప్‌లో మిక్స్‌డ్ టీమ్‌లో పసిడితో జోరు మీదున్నారు. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానంలో ఉన్న ఈ జంటకు.. కొరియా, మెక్సికో, నెదర్లాండ్స్ ఆర్చర్ల నుంచి సవాలు ఎదురయ్యే వీలుంది.
ఇదీ చూడండి: Olympics: అలాగైతే రెండు జట్లకూ స్వర్ణం