మరికొద్ది రోజుల్లో టోక్యో వేదికగా ఒలింపిక్స్ జరగనున్నాయి. అయితే కరోనా కారణంగా పోటీలు జరుగుతాయా? లేదా? అనే సందేహాలు వస్తున్నాయి. కాగా, భారత క్రీడాకారులు మాత్రం ఎక్కడా తగ్గకుండా ప్రాక్టీసు చేస్తున్నారు. పతకమే లక్ష్యంగా చెమట చిందిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో మనదేశం తరఫున కచ్చితంగా పతకం సాధిస్తారు అని అనుకుంటున్న కొంతమంది ప్లేయర్ల గురించే ఈ కథనం.
పీవీ సింధు- బ్యాడ్మింటన్
రియో ఒలింపిక్స్‌లో వెండి పతకంతో సరిపెట్టుకున్న సింధు (PV Sindhu).. 2019లో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచి అదరగొట్టింది. అదే ఊపులో టోక్యో మెగాక్రీడలకు సిద్ధమైంది. కానీ కరోనా కారణంగా అవి కాస్త వాయిదా పడ్డాయి.
ప్రస్తుతం ఏడో ర్యాంక్‌లో ఉన్న సింధు.. టోక్యోలో స్వర్ణం లక్ష్యంగా బరిలోకి దిగనుంది. ఇప్పటికే మూడు ప్రపంచ ఛాంపియన్షిప్ ఫైనల్స్ ఆడిన అనుభవం, ఆసియన్ గేమ్స్ రజతం, కాంస్య పతకాలు గెలవడం.. కామన్వెల్త్ క్రీడల్లో వెండి పతకం.. ఈమెకు కలిసొచ్చే అంశం.
అమిత్ పంగల్ - బాక్సర్
2018 ఆసియా గేమ్స్ ఫైనల్లో రియో ఒలింపిక్స్ విజేతను ఓడించిన తర్వాత నుంచి బాక్సింగ్‌లో హవా చూపిస్తున్నాడు అమిత్ (Amit Panghal). ప్రస్తుతం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న విభాగంలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఈసారి ఒలింపిక్స్‌లో 49 కిలోల విభాగం తీసేయడం వల్ల 52 కిలోల విభాగం నుంచి పోటీచేయనున్నాడు. 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం, 2018 ఆసియా క్రీడల్లో స్వర్ణం.. ఇతడిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నాయి. దీంతో ఒలింపిక్స్‌లో పతకం సాధిస్తాననే నమ్మకంతో అమిత్ ఉన్నాడు.
వినేశ్ ఫొగాట్ - రెజ్లింగ్
రియో పోటీల్లో పాల్గొని, గాయం కారణంగా మధ్యలోనే నిష్క్రమించింది ప్రముఖ మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగాట్ (Vinesh Phogat). ఆ తర్వత మూడేళ్లకు భారత్ తరఫున టోక్యో ఒలింపిక్స్ కోసం అర్హత సాధించిన తొలి ప్లేయర్‌గా నిలిచింది. 2018లో ఆసియా, కామన్వెల్త్ క్రీడల్లో బంగారు పతకాలు గెలుచుకుంది. ప్రస్తుతం టోక్యోలో పతకం సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది.
మేరీ కోమ్ - బాక్సింగ్
38 ఏళ్ల మేరీకోమ్ (mary Kom) వయసుతో సంబంధం లేకుండా బాక్సింగ్‌లో దూసుకెళ్తోంది. ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్, లండన్ ఒలింపిక్స్‌లో కాంస్యం ఈమె ఘనతలు. అయితే మెగాక్రీడల్లో స్వర్ణం ఒక్కటే మేరీ సాధించలేకపోయింది. ఈసారి దానిని ఎలాగైనా సరే ఒడిసిపట్టేయాలని కృత నిశ్చయంతో ఉంది.
ఎలవెనిల్ వలరివాన్- షూటింగ్
లండన్ ఒలింపిక్స్ పతక విజేత గగన్ నారంగ్ ఆధ్వర్యంలో రాణిస్తున్న యువ షూటర్ వలరివాన్ (Elavenil Valarivan).. నిలకడైన ప్రదర్శనతో టోక్యో ఒలింపిక్స్‌లో పతకంపై ఆశలు పెంచుతోంది. 2019లో జరిగిన రెండు ప్రపంచకప్‌ల్లో తానేంటో నిరూపించిన ఈ షూటర్.. టోక్యోలో పతకమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.