చైనాతో పాటు పలు దేశాలను వణికిస్తోన్న 'కరోనా' ప్రభావం... టోక్యో ఒలింపిక్స్ ముందస్తు కార్యక్రమాలపై పడుతోంది. వాలంటీర్లకు నేటి నుంచి జరగాల్సిన శిక్షణా తరగతులను నిర్వాహకులు.. ఈ కారణంగానే వాయిదా వేశారు. వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మారిన తేదీలను త్వరలో వెల్లడిస్తామన్నారు. వైరస్ వ్యాప్తి నిరోధించేందుకు తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్తగా ఈ చర్యలు తీసుకున్నామని వివరించారు.
జులై 24 నుంచి ఈ క్రీడలు మొదలుకానున్నాయి. వీటి నిర్వహణపై ఈ వైరస్ ప్రభావం ఏం ఉండదని, కచ్చితంగా అనుకున్న సమయానికి టోర్నీ ప్రారంభిస్తామన్నారు ఒలింపిక్స్ నిర్వాహకులు. వచ్చే నెల(మార్చి) 1న టోక్యో మారథాన్ నిర్వహించనున్నారు. దీనికి పలువురు అథ్లెట్లు హాజరుకానున్నారు.
జపాన్‌లో ఇప్పటికే దాదాపు 100 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో ముగ్గురు మరణించారు. ఇటీవల ఆ దేశంలోని యెకోహమా తీరంలో నిలిపి ఉంచిన నౌకలో.. దాదాపు 500 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారించారు.
మేయర్ అభ్యర్థి సంచలన కామెంట్
టోక్యోలో జరగాల్సిన ఒలింపిక్స్ వేదిక మార్చాల్సి వస్తే అందుకు తాము సిద్ధంగా ఉన్నామని, లండన్ మేయర్ పదవికి పోటీపడుతున్న కన్జర్వేటివ్ అభ్యర్థి షౌన్ బైయిలీ ప్రకటించడం విమర్శలు దారితీసింది. 2012తో పోలిస్తే ఇప్పుడు క్రీడలు నిర్వహించడానికి కావాల్సిన సౌకర్యాలు మరింత మెరుగుపడ్డాయని, వేదికలో మార్పు జరిపితే లండన్‌ను పరిగణించాలని ఒలింపిక్ కమిటీని కోరాడు. ఒకవేళ తాను మేయర్‌గా ఎన్నికైతే ఒలింపిక్స్ నిర్వహణకు అన్ని చర్యలు తీసుకుంటానని ప్రకటించాడు. ఇతడి చేసిన ఈ వ్యాఖ్యలపై లండన్‌తో పాటు జపాన్‌లోనూ విమర్శలు వ్యక్తమయ్యాయి.
మే7న జరగనున్న లండన్ మేయర్ ఎన్నిక నేపథ్యంలోనే బైయిలీ ఈ ప్రకటన చేశారని విమర్శిస్తున్నారు. లండన్ అధికారులు ఈ ప్రకటనను కొట్టిపడేయగా.. స్పందించిన టోక్యో గవర్నర్ ఇది ఆయనకు అనవసర విషయమని అభిప్రాయపడ్డాడు.