Handball Player Kareena: రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం.. పైగా అయిదుగురు సంతానం.. అందులో ముగ్గురు ఆడపిల్లలు. నాన్న వ్యవసాయ కూలీ.. అప్పుడప్పుడు ఆటో నడుపుతుంటాడు.. ఇదీ కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా చిచుపల్లి గ్రామానికి చెందిన 16 ఏళ్ల కరీనా కుటుంబ నేపథ్యం. పేదరికాన్ని చూసి ఆమె ఆగిపోలేదు. హ్యాండ్‌బాల్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించే స్థాయికి ఎదిగింది. ఆటలతో జీవితం మారుతుందని ప్రోత్సహించిన తండ్రి రమేష్ నమ్మకాన్ని నిలబెడుతూ ముందుకు సాగుతోంది. పదేళ్ల వయసులో ఆమెను పాఠశాలలో హ్యాండ్‌బాల్ ఆట ఆకర్షించింది. అక్కడి గురువుల సహకారంతో సాధన చేసి రాటుదేలింది. బంతిపై పట్టు దక్కించుకుని, వేగంగా విసరడంలో ప్రావీణ్యం సాధించింది. జిల్లా స్థాయిలో రాణించింది. రాష్ట్ర స్థాయిలోనూ దూకుడు ప్రదర్శించి వెలుగులోకి వచ్చింది. 2019, 2020 జాతీయ ఛాంపియన్‌షిప్స్‌లో తెలంగాణ తరపున సత్తాచాటింది.
"ఒలింపిక్స్‌లో పాల్గొనడంతో పాటు దేశం కోసం పతకం సాధించడమే నా లక్ష్యం. దీంతో పాటు ఐపీఎస్ అధికారిణి కావాలని చిన్నప్పటి నుంచి కల కంటున్నా. ఆ ఆశయాన్ని అందుకోవడానికి కృషి చేస్తా. తల్లిదండ్రుల కష్టం, కోచ్‌లు, హ్యాండ్‌బాల్ సంఘం ప్రోత్సాహంతో ఇక్కడి వరకూ వచ్చా"
-కరీనా
వ్యవసాయ కూలీగా..: ఆటతో పాటు చదువులోనూ కరీనా మేటి. పదో తరగతిలో 9.7 గ్రేడు సాధించి తెలంగాణ గిరిజన వసతి కళాశాలలో సీటు సాధించింది. ప్రస్తుతం ఆమె ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. లాక్‌డౌన్ కారణంగా కొంత కాలం పాటు ఆటకు దూరంగా ఉండాల్సి వచ్చినా ఆమె సాధన మాత్రం ఆపలేదు. ఇంటి దగ్గర, పంట పొలాల్లో కసరత్తులు కొనసాగించింది. ఆ సమయంలో వ్యవసాయ కూలీగా మారి కుటుంబానికి తోడుగా నిలిచింది. వైరస్ తగ్గి పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాక తిరిగి లయ అందుకునేందుకు శ్రమించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన సెలక్షన్ ట్రయల్స్‌లో ప్రతిభ కనబరిచి ఆసియా మహిళల యూత్ హ్యాండ్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టు ప్రాబబుల్స్‌లో చోటు దక్కించుకుంది. శిక్షణ శిబిరంలో తన ప్రదర్శనతో ఆకట్టుకుని భారత జట్టుకు ఎంపికై పోటీల కోసం కజకిస్థాన్ వెళ్లింది. దక్షిణాది రాష్ట్రాల నుంచి జట్టుకు ఎంపికైన ఏకైక క్రీడాకారిణి కరీనానే కావడం విశేషం.
ఇదీ చదవండి: కొత్త జట్టుకు పెద్ద దెబ్బ.. ఐపీఎల్ నుంచి ఆ బౌలర్ ఔట్