భారత చదరంగంలో మరో గ్రాండ్‌మాస్టర్(జీఎం) అవతరించాడు. 17 ఏళ్ల తెలంగాణ కుర్రాడు రాజా రిత్విక్(Raja Rithvik Chess) శనివారం జీఎం హోదా అందుకున్నాడు. రాష్ట్రం నుంచి ఈ ఘనత సాధించిన మూడో చెస్ ఆటగాడిగా.. మొత్తంగా దేశంలో 70వ గ్రాండ్‌మాస్టర్‌గా నిలిచాడు. తెలంగాణ నుంచి ఇప్పటికే అర్జున్ ఎరిగేసి, హర్ష భరత్‌కోటి జీఎంలుగా కొనసాగుతున్నారు. హంగేరీలో జరుగుతున్న వెజర్‌కెప్జో గ్రాండ్‌మాస్టర్ టోర్నీలో నాలుగు రౌండ్ల నుంచి అయిదు పాయింట్లు ఖాతాలో వేసుకున్న రిత్విక్ .. 2501 ఎలో రేటింగ్ చేరుకోవడం వల్ల జీఎం హోదా దక్కింది.
ఈ టోర్నీ కంటే ముందే అతను మూడు జీఎం నార్మ్‌లు సొంతం చేసుకున్నప్పటికీ.. రేటింగ్ 2496 ఉండడంతో జీఎం కాలేకపోయాడు. ఇప్పుడీ టోర్నీలో పాయింట్లతో తన కలను నిజం చేసుకున్నాడు. నాలుగో రౌండ్లో తెల్ల పావులతో ఆడిన రిత్విక్.. 57 ఎత్తుల్లో ఫినెక్(చెకోస్లోవేకియా)ను ఓడించడం వల్ల జీఎం హోదా పొందడానికి అవసరమైన ఎలో రేటింగ్‌ను చేరుకున్నాడు. 2019 డిసెంబర్‌లోనే రిత్విక్.. తన తొలి జీఎం నార్మ్ సాధించాడు. ఈ ఆగస్టులో రెండో నార్మ్ సాధించిన అతను.. ఇప్పుడు మూడో నార్మ్ అందుకున్నాడు.
ఎత్తుల్లో ఎత్తుకు
రిత్విక్ ఆరేళ్ల వయసులో తన తండ్రి చదరంగం ఆడుతుంటే చూసి తొలి చూపులోనే ఆ 64 గళ్లపై ప్రేమ పెంచుకున్నాడు. వేసవి శిక్షణ శిబిరంలో చదరంగంలో శిక్షణ ఇప్పిస్తే సత్తా చాటాడు. అప్పటి నుంచే చెస్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాడు. పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన రిత్విక్ కుటుంబంతో వరంగల్‌లో స్థిరపడగా.. మెరుగైన శిక్షణ కోసం హైదరాబాద్ వచ్చాడు. కోచ్ రామరాజు దగ్గర చేరి ఆటలో మరింత పట్టు సాధించాడు.
"గ్రాండ్‌మాస్టర్ కలను నిజం చేసుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. జులైలో అమ్మతో కలిసి ఐరోపా వచ్చా. రెండు జీఎం నార్మ్‌లతో పాటు ఎలో రేటింగ్ పెంచుకుని అనుకున్నది సాధించా. 2600 ఎలో రేటింగ్‌తో ఎలైట్ క్లబ్‌లో చేరడంతో పాటు ప్రపంచ ఛాంపియన్‌గా నిలవడమే నా తదుపరి లక్ష్యం"
- హంగేరీ నుంచి 'ఈనాడు'తో రిత్విక్
13 ఏళ్ల వయసులోనే అండర్-13తో పాటు ఏకంగా అండర్-17 జాతీయ టైటిళ్లు సాధించాడు. 2018లో ఆసియా యూత్ ఛాంపియన్‌షిప్‌లో మొత్తం అయిదు స్వర్ణాలు సాధించాడు. రిత్విక్ చెస్ కెరీర్ కోసం తల్లి దీపిక తన లెక్చరర్ ఉద్యోగాన్ని వదిలేసింది. 14 ఏళ్లకే ఇంటర్నేషనల్ మాస్టర్ హోదా దక్కించుకున్న రిత్విక్.. ఇంకా ముందుగానే జీఎం కావాల్సింది.
కానీ కరోనా కారణంగా అతనికి ఎదురు చూపులు తప్పలేదు. వైరస్ తగ్గుముఖం పట్టగానే గ్రాండ్‌మాస్టర్ హోదా సాధించాకే తిరిగి భారత్‌కు రావాలనే ఉద్దేశంతో ఐరోపా వెళ్లాడు. అక్కడే వరుసగా టోర్నీల్లో పాల్గొంటూ కఠిన ప్రత్యర్థులను ఎదుర్కొని 20 రోజుల వ్యవధిలోనే మిగతా రెండు జీఎం నార్మ్‌లతో పాటు 2500 ఎలో రేటింగ్‌ను అందుకున్నాడు.
ఇదీ చూడండి.. ఐపీఎల్ సందడి వచ్చేసింది.. కిక్కు తెచ్చేసింది!