దిల్లీలో జరుగుతున్న షూటింగ్ ప్రపంచకప్‌లో హంగేరికి చెందిన ఇద్దరు ఆటగాళ్లు గొడవపడ్డారు. దీంతో 'రైఫిల్ త్రీ పొజిషన్స్' విభాగంలో మనతో ఆడాల్సిన ఆ దేశ జట్టు.. ఫైనల్ నుంచి తప్పుకుంది. ఫలితంగా గురువారం జరగాల్సిన ఆ పోటీ శుక్రవారానికి వాయిదా పడింది. తుదిపోరులో భారత్‌తో అమెరికా తలపడనుంది.
ఏం జరిగింది?
హంగేరి జట్టులోని ఇస్త్వన్ పెనీ(ప్రపంచ నం.1), పీటర్ సిది(2010 ప్రపంచ ఛాంపియన్) మధ్య రైఫిల్స్ విషయమై చిన్నపాటి గొడవ జరిగింది. దీంతో ఆ దేశ బృందం.. ఫైనల్‌కు ముందు ఫైరింగ్ లైన్ దగ్గర రిపోర్ట్ చేయలేదు.
సిది, వ్యక్తిగత పరికరాల నియమాలను పాటించట్లేదని పెనీ ఆరోపించాడు. నిబంధనలకు విరుద్ధంగా బైపాడ్ ఉపయోగిస్తున్నాడని అన్నాడు. అయితే తాను రూల్స్‌ను సక్రమంగా పాటిస్తున్నానని సిదీ అంటున్నాడు. గతంలో వీరిద్దరూ ఇలానే పలు టోర్నీల్లో గొడవలు పెట్టుకున్నారు. అయితే ఓ అంతర్జాతీయ టోర్నీలో ఇలా చేయడం ఇదే మొదటిసారి. కొన్ని నెలల్లో ఒలింపిక్స్ జరగనున్న నేపథ్యంలో అప్పటిలో ఈ వివాదం సద్దుమణుగుతుందా లేదా అనేది చూడాలి.