ఖేలో ఇండియా పథకాన్ని 2021-22 నుంచి 2025-26 వరకు పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజిజు రాజ్యసభలో వెల్లడించారు.
"ఈ ఐదేళ్ల కాలానికి గానూ ఖేలో ఇండియా పథకానికి రూ.8,750 కోట్ల బడ్జెట్‌ను అంచనా వేసింది ప్రభుత్వం. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గానూ ఈ పథకానికి రూ.657.71 కోట్లను కేటాయించింది. ఒలింపిక్స్‌తో సహా అంతర్జాతీయ క్రీడా కార్యక్రమాలకు భారత క్రీడాకారులను సిద్ధం చేయడం కోసం ఖేలో ఇండియా ఉపయోగపడుతుంది. అంతర్జాతీయ, జాతీయ టోర్నమెంట్ల నిర్వహణ, అవసరమైన శాస్త్ర, సాంకేతిక పరికరాల కొనుగోలు.. భారత, విదేశీ కోచ్‌ల ద్వారా క్రీడాకారులకు శిక్షణ ఇవ్వడం ఇందులో భాగం."
-కిరణ్ రిజిజు, కేంద్ర క్రీడల శాఖ మంత్రి.
దేశవ్యాప్తంగా ఉన్న క్రీడాకారులకు ఒలింపిక్స్‌లో గరిష్ఠ కోటా పొందటానికి, పతకాలు సాధించే అవకాశాలను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తోందని.. రిజిజు రాజ్యసభకు తెలిపారు. దివ్యాంగులకు క్రీడా అవకాశాలను ప్రోత్సహించడం కోసం ఇప్పటివరకు రూ.13.73 కోట్లు విడుదల చేసినట్లు పేర్కొన్నారు.
ఎన్టీఎస్పీ పోర్టల్..
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) తీసుకొచ్చిన నేషనల్ టాలెంట్ సెర్చ్ పోర్టల్(ఎన్టీఎస్పీ)లో ఇప్పటివరకు 33వేల 552 మంది నమోదు చేసుకున్నారని కిరణ్ రిజిజు తెలిపారు. 17లక్షలకు పైగా ఈ పోర్టల్‌ను సందర్శించారని పేర్కొన్నారు.
కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ, సాయ్ కలిసి ఈ పోర్టల్‌ను ప్రారంభించాయి. ఏదైనా ఆటలో నైపుణ్యం ఉన్న క్రీడాకారులకు తమ లక్ష్యాలను చేరుకోవడానికి ఏర్పాటు చేసిన ఉమ్మడి వేదికే ఈ పోర్టల్. దీనిని 2017 ఆగస్టు 17న ఉప రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభించారు.
ఇదీ చదవండి: ప్రపంచకప్: అదరగొట్టిన భారత షూటర్లు