దేశవ్యాప్తంగా లక్షల మంది పాల్గొనే 'ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్'ను వర్చువల్‌గా ప్రారంభించారు కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు. ప్రజలంతా ఫిట్‌గా ఉండాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం.
"ఫ్రీడమ్ రన్లో పాల్గొనడానికి భారీ స్థాయిలో ఆసక్తి చూపుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఉద్యోగులు సహా వారి కుటుంబాలను ఈ పరుగులో భాగం చేయడం ద్వారా స్వాతంత్ర్య దినోత్సవం రోజున గొప్ప నివాళిగా నిలిచిపోతుంది. ఈ ఫిట్ ఇండియా ఉద్యమం.. ప్రజా ఉద్యమంగా మారాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆశించారు. అది సాకారం అవుతుందని నమ్మకముంది".
-కిరణ్ రిజిజు, కేంద్ర క్రీడాశాఖ మంత్రి
ప్రస్తుతం దేశమంతా కరోనా కేసులు పెరిగిపోతున్న కారణంగా ఇందులో పాల్గొనే వారంతా తమకు అనువైన ప్రదేశాలని ఎంచుకోవాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమం ఆగస్టు 15 నుంచి అక్టోబరు 2 వరకు నిర్వహించనున్నారు.
సాయుధ దళాలూ భాగమే
ఈ దేశవ్యాప్త పరుగులో సాయుధ దళాలైన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్), ఇండో-టిబెటియన్ పోలీస్ (ఐటీబీటీ), సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్ (సీఆర్పీఎఫ్) భాగం కానున్నాయి. భారతీయ రైల్వే, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ పాఠశాలలతో కలిసి వీరు ఫ్రీడమ్ పరుగులో పాల్గొననున్నారు.
75 లక్షల మంది వాలంటీర్లు
నెహ్రూ యువ కేంద్ర సంగతాన్ (ఎన్వైకేఎస్), నేషనల్ సర్వీస్ స్కీమ్ (ఎన్ఎస్ఎస్)కు సంబంధించిన 75 లక్షల మంది యువకులతో పాటు క్రీడా సంస్థలకు చెందిన వారంతా ఈ కార్యక్రమంలో భాగం కానున్నారు.