ఐరన్‌మ్యాన్ ఓ సాహస క్రీడ. స్విమ్మింగ్, రన్నింగ్, సైక్లింగ్‌లతో కూడిన ట్రయథ్లాన్ ఇది..! 3.86 కిలోమీటర్ల ఈత, 180.25 కిలోమీటర్ల సైక్లింగ్, 42.2 కిలోమీటర్ల పరుగు మొత్తంగా 226.3 కిలోమీటర్ల ఈవెంట్‌ను 17 గంటల్లో ఎలాంటి విశ్రాంతి లేకుండా పూర్తి చేయాలి. వివిధ విభాగాల్లో సుదూర లక్ష్యాన్ని చేరుకునే క్రీడే ఈ ఐరన్‌మ్యాన్. ప్రపంచ ట్రయత్లాన్ కార్పొరేషన్(డబ్ల్యూటీసీ) నిర్వహించే ఈ పోటీకి... ప్రపంచ కఠిన పోటీల్లో ఒకటిగా పేరు. ఒక్కరోజులో మూడు విభాగాల్లో పోటీపడుతూ గమ్యాన్ని చేరుకోవాలి. ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ పోటీలో భాగంగా.. 2 గంటల 20 నిమిషాల్లో అంటే గం.9.20లకు ఈత ముగించాలి. సాయంత్రం గం.5.30 లోపు సైక్లింగ్, రాత్రి 12.00 లోపు పరుగు పూర్తి చేయగలగాలి. అలా విజయవంతమైతేనే.. అతణ్ని ఐరన్‌మ్యాన్‌గా ప్రకటిస్తారు. ఈశ్వర్ మారూరి.. ఈ మొత్తాన్ని కలిపి 12 గంటల 36 నిమిషాల్లోనే పూర్తి చేశారు. అక్టోబర్ 13న అమెరికాలో జరిగిన ఐరన్ మ్యాన్ లూస్ విల్లీస్ ఈవెంట్ లో ఈ ఘనత సాధించారు.
ఈశ్వర్ మారూరి ప్రస్థానం
ఈశ్వర్ పుట్టి పెరిగింది గుంటూరు జిల్లా చాగంటి వారిపాలెం. ప్రభుత్వ పాఠశాలలో, స్కాలర్‌షిప్‌ల సాయంతో చదువుకున్న ఈశ్వర్‌కు చిన్నప్పటి నుంచీ సాహస క్రీడలంటే మక్కువ ఎక్కువ. ఈశ్వర్ ప్రస్తుతం అమెరికాలోని చికాగోలో.. ఓ సాఫ్ట్వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. ఉద్యోగ రీత్యా కొంతకాలంగా అమెరికాలో ఉంటున్న ఆయన... హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. అమెరికాలో జరిగిన ట్రయథ్లాన్‌లో పాల్గొని ఐరన్‌మ్యాన్ అనిపించుకున్నారు. భార్య రమాదేవి ప్రోత్సాహం ఆయనకు కొండంత అండగా నిలిచింది. రమాదేవి ఈశ్వర్ దంపతులకు అనఘ అనే కుమార్తె ఉంది.
సాహస క్రీడలపై ఆసక్తి చూపే ఈశ్వర్.. ఐరన్ మ్యాన్ పోటీ కోసం నెలల తరబడి శిక్షణ తీసుకున్నారు. ఐదేళ్ల క్రితం యూ ట్యూబ్‌లో ఈ పోటీ గురించి ఓ వీడియో చూశారట. ఇది ఎవరికీ సాధ్యపడదని అనుకున్నారు. తర్వాత తన ఆలోచన మార్చుకున్నారు. ఎలాగైనా ట్రయథ్లాన్ పూర్తి చేసి ఐరన్‌మ్యాన్ అనిపించుకోవాలనుకున్నారు. నెలల పాటు కఠోర శ్రమతో అసాధ్యం అనుకున్న పోటీని పూర్తి చేశారు. అక్టోబర్ 13న అమెరికాలోని లూయిస్విల్లీలో జరిగిన ఐరన్‌మ్యాన్ పోటీలో పాల్గొన్న ఏకైన భారతీయుడుగా నిలవడమే కాక... ఈవెంట్‌ను విజయవంతంగా పూర్తి చేసిన ఘనత సాధించారు. 226 కిలోమీటర్ల దూరాన్ని 12 గంటల 36 నిమిషాల్లో ముగించి తెలుగు ఐరన్‌మ్యాన్ అనిపించుకున్నారు. ఈశ్వర్ ఇప్పటి వరకూ 9 మారథాన్లు, 3 అల్ట్రా మారథాన్లు, 2 ఐరన్‌మ్యాన్ 70.3 పోటీల్లో పూర్తిచేశాడు. 2018లో 70 మైళ్ల పెర్ఫార్మెన్స్ను రెండుసార్లు విజయవంతంగా పూర్తి చేశారు.
''నన్ను నేను పరీక్షించుకోవడానికి ఎన్డ్యూరెన్స్ క్రీడలను ఎంచుకున్నా. ఈ క్రీడల ద్వారా వీటి ఆవశ్యతకను పిల్లలకు తెలిపి, ఆటలతో ఆరోగ్యాన్ని ఎలా పొందవచ్చో తెలియజేస్తున్నా. పిల్లల్లో క్రీడల పట్ల అవగాహన కల్పించడానికి ట్రైడర్స్ గ్రూపును స్థాపించాను. ఎన్జీవో సంస్థ సహకారంతో 'ఫిట్నెస్ ఫర్ కాజ్' అనే సిద్ధాంతంతో పనిచేస్తున్న ట్రైడర్స్ గ్రూపుతో 20 లక్షల నిధులు సమీకరించాం. వీటిని పేదపిల్లల చదువుకు, ఆరోగ్య పరిస్థితి మెరుగుపర్చడానికి వినియోగిస్తున్నాం''
- ఈశ్వర్ మారూరి
స్వచ్ఛంద సేవలో..
ఈశ్వర్ స్వయంగా రెండు స్వచ్ఛంద సంస్థలను నడుపుతూ పేదవిద్యార్థులకు అండగా నిలుస్తున్నారు. అడాప్ట్ చైల్డ్ ఆన్లైన్(ఏసీవో) అనే సంస్థను స్థాపించారు. పేదరికంలో మగ్గుతున్న విద్యార్థులను ఈ సంస్థ ద్వారా ఆర్థికంగా ఆదుకుంటున్నారు. ఉన్నత చదువులు చెప్పిస్తున్నారు. దాతలకు.. విద్యార్థులకు మధ్య ఏసీవో వారధిగా నిలుస్తోంది. ఇటీవలే ఏసీవో ద్వారా చదువుకున్న ఓ విద్యార్థి ఒరాకిల్ ఉద్యోగం సాధించి, ఉన్నత స్థాయికి చేరాడు. ఈ విషయం తనకు ఎంతో ఆనందం కలిగించిందని ఈశ్వర్ అన్నారు. సాహసక్రీడల్లో రాణించడమే కాక.. సేవాదృక్పథాన్ని చాటుకుంటూ రియల్ ఐరన్‌మ్యాన్ అనిపించుకుంటున్నారు ఈశ్వర్ మారూరి.