రెండుసార్లు ఒలింపిక్స్ మెడల్ విజేత, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్‌షిప్ నుంచి నిష్క్రమించింది. చైనాకు చెందిన జాంగ్ యి మ్యాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సింధు.. ఓటమిపాలై ఇంటిముఖం పట్టింది. 39 నిమిషాలు పాటిన సాగిన మ్యాచ్‌లో సింధు.. 17-21 11-21 తేడాతో ఓడిపోయింది. 2023లో జరిగిన మూడు టోర్నీల్లో తొలి రౌండ్లోనే ఆమె వెనుదిరిగింది. ఈ ఏడాది జనవరిలో మలేసియా ఓపెన్‌లో స్పెయిన్‌కు చెందిన కరోలినా మారిన్ చేతిలో ఓడిపోయిన సింధు.. అదే నెలలో జరిగిన ఇండియన్ ఓపెన్‌లోనూ తొలి రౌండ్లోనే నిష్క్రమించింది.
భారత మహిళల డబుల్స్ జోడీ జాలీ- గాయత్రీ గోపీచంద్ పుల్లెల.. తొలి రౌండ్లో గెలిచారు. 46 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో ఏడో సీడ్ థాయిలాండ్ జోంగ్‌కోల్ఫాన్ కితితారాకుల్-రవింద ప్రజోంగ్‌జాయ్‌పై 21-18 21-14 తేడాతో విజయం సాధించారు. ప్రీక్వార్టర్స్‌లో ఈ జోడీ జపాన్‌కు చెందిన యుకీ ఫుకుషిమా, సయాకా హిరోటా జంటతో తలపడనుంది. పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్, హెచ్ఎస్ ప్రణయ్ తమ మొదటి రౌండ్ మ్యాచ్‌ల్లో విజయం సాధించారు.
అయితే ఈ ఏడాది ఫిబ్రవరి చివరి వారంలో.. పీవీ సింధు తన కోచ్ పార్క్ టే సాంగ్‌తో తెగతెంపులు చేసుకుంది. నాలుగేళ్ల పాటు పార్క్ కోచింగ్‌లో శిక్షణ పొందిన ఆమె.. ప్రస్తుతం కొత్త కోచ్ కోసం వెతుకులాటలో పడింది. ఈ విషయాన్ని పార్క్ స్పష్టం చేశాడు. ఈ ఏడాది సీజన్ గొప్పగా ప్రారంభించని నేపథ్యంలో సింధు నిర్ణయాన్ని గౌరవిస్తూ తానే స్వయంగా తప్పుకుంటున్నట్లు తెలిపాడు.
2019 వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ నుంచి పార్క్ టే సాంగ్ - సింధు ప్రయాణం మొదలైంది. మొదట్లో అతడిని మెన్స్ సింగిల్స్ కోచ్‌గా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నియమించినా.. తర్వాత సింధు పర్సనల్ కోచ్‌గా మారాడు. పార్క్ కోచింగ్ శిక్షణలో సింధు ప్రపంచ ఛాంపియన్‌షిప్స్ స్వర్ణం, టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం, కామన్వెల్త్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్‌ను ముద్దాడింది. కానీ కొంత కాలంగా సింధు వరుస పరాజయాలను అందుకుంటోంది. గతేడాది మడమ గాయం కారణంగా చాలా కాలం పాటు బ్యాడ్మింటన్ కోర్టుకు దూరంగా ఉన్న ఆమె.. టోక్యోలో జరిగిన వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లోనూ పాల్గొనలేదు. సింధు కోచ్‌గా బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు చెబుతూ పార్క్ కూడా ఓ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. సింధు వైఫల్యాలకు కోచ్‌గా తానే బాధ్యత వహిస్తున్నట్లు స్పష్టం చేశాడు.