Shooting World Championships 2023 Esha Singh Shiva Narwal : ప్రపంచ సీనియర్ షూటింగ్ ఛాంపియన్‌షిప్ మిక్స్‌డ్ డబుల్స్.. భారత్ ఖాతాలో తొలి స్వర్ణ పతకం చేరింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో ఇషా సింగ్ –శివా నర్వాల్ జోడీ గోల్డ్ మెడల్‌ను ముద్దాడింది. తెలంగాణ హైదరాబాద్‌కు చెందిన ఇషా సింగ్.. హరి యాణాకు చెందిన శివా నర్వాల్ ఫైనల్లో 16–10 తేడాతో తర్హాన్ ఇలేదా–యూసుఫ్ డికెచ్ (తుర్కియే) జోడీపై విజయం సాధించారు. క్వాలిఫికేషన్లో 583 పాయింట్లతో టాప్ పొజిషన్లో నిలిచిన ఇషా (290)-నర్వాల్ (293) జోడీ ఫైనల్లోనూ అదే జోరును కొనసాగించి ఈ పసిడిని పట్టేసింది.
అంతకుముందు ప్రపంచ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు 8 స్వర్ణాలు దక్కాయి. ఇషా జోడీ కన్నా ముందు అభినవ్ బింద్రా (2006, 10 మీ. ఎయిర్‌రైఫిల్), మానవ్‌జీత్ సింగ్ (2006, ట్రాప్), తేజస్విని (2010, 50 మీ. రైఫిల్ ప్రోన్), ఓం ప్రకాశ్ (2018, 50 మీ. పిస్టల్), అంకుర్ మిత్తల్ (2018, డబుల్ ట్రాప్), రుద్రాంక్ష్ పాటిల్ (2022), అర్జున్-కిరణ్, రుద్రాంక్ష్ (2022, 10 మీ.రైఫిల్ టీమ్) గోల్డ్ మెడల్ సాధించారు.
ఇషాకు(Eesha singh shooter) కూడా ఇదే మొదటి గోల్డ్ మెడల్ కావడం విశేషం. "ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. మిక్స్‌డ్ ఈవెంట్లో స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించడం ఎంతో గొప్పగా అనిపిస్తోంది" అని ఇషా ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఇషాసింగ్.. మొదటిసారి భారత్ తరఫున అరంగేట్రం చేసే సమయానికి ఆమె వయసు 14 ఏళ్లే! భారత షూటర్లలో అందరికన్నా ఈమె చిన్నది. అయినా కూడా సీనియర్లను కూడా వెనక్కి నెట్టి కెరీర్లో దూసుకెళ్లింది. రహీ సర్నోబత్, మను బాకర్ లాంటి స్టార్లను కూడా ఓడించి గుర్తింపు అందుకుంది. 2021లో జూనియర్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రజతాన్ని అందుకుంది. గతేడాది కైరో వేదికగా జరిగిన వరల్డ్ కప్‌లో మూడు గోల్డ్ మెడల్స్, ఓ బ్రాంజ్ మెడల్ సాధించింది. ఇప్పుడు వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లోనూ గోల్డ్ మెడల్ అందుకుంది కెరీర్ మరో మెట్టు ఎక్కింది.
ప్రస్తుతం హైదరాబాదీ గగన్ నారంగ్ అకాడమీ గన్ అండ్ గ్లోరీలో ట్రైనింగ్ తీసుకుంటున్న ఇషా.. తన నెక్ట్స్ టార్గెట్ పారిస్ ఒలింపిక్స్ అని చెప్పింది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో ప్రధాన షూటింగ్ గ్రూపులో ఉన్నప్పటికీ.. తుది జట్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోయింది. అయితే ఈసారి మాత్రం చాలా పట్టుదలతో ఉంది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌తో పాటు 25 మీటర్ల పిస్టల్‌లోనూ రాణిస్తోంది. రీసెంట్గా దిల్లీలో నేషనల్ సెలక్షన్ టోర్నీలో 25 మీటర్ల పిస్టల్‌లో 589/600 స్కోరు చేసి అదరగొట్టింది. తద్వారా సెప్టెంబర్‌లో హాంగ్జౌలో జరిగే ఆసియా క్రీడల బెర్తు దక్కించుకుంది. ఈ మెగా ఈవెంట్లోనూ అద్భుత ప్రదర్శన చేసి ఒలింపిక్స్‌కు ముందు మరింత ఆత్మవిశ్వాసం కూడ గట్టుకోవాలని చూస్తోంది.
Dutee Chand Doping Test : డోపింగ్ టెస్ట్‌లో ఫెయిల్.. ద్యుతీచంద్‌పై నాలుగేళ్ల బ్యాన్..
Ind vs Ire T20 : ఐర్లాండ్‌పై తొలి టీ20లో భారత్ విజయం.. రీఎంట్రీలో అదరగొట్టిన బుమ్రా