దుబాయ్ వేదికగా జరుగుతున్న ఆసియన్ జూనియర్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు నాలుగు స్వర్ణపతకాలు సాధించారు. నేషనల్ ఛాంపియన్ అయిన రోహిత్ చమోలి 48 కేజీల విభాగంలో పసిడి పతకాన్ని సాధించి భారత్కు తొలిస్వర్ణాన్ని అందించాడు. ఫైనల్లో మంగోలియాకు చెందిన ఒత్‌గోన్‌బయర్ తువ్‌సింజయాతో తలపడ్డాడు రోహిత్. ఇక 81 కేజీల విభాగంలో భరత్ జాన్ పసిడిని ఒడిసిపట్టాడు. 48 కేజీల బాలికల విభాగంలో విషు రథీతో పాటు.. 52 కేజీల విభాగంలో తనూ పతక ప్రదర్శన చేశారు.
ఆసియన్ జూనియర్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ ఇప్పటికే ఆరు కాంస్య పతకాలను తన ఖాతాలో వేసుకుంది. ఇక 70 కిలోల విభాగంలో తలపడిన గౌరవ్ సైనీ.. రజత పతకాన్ని సాధించాడు. మరో బాక్సర్ ముస్కాన్(46 కిలోలు) కాంస్య పతకం సాధించింది.
2019లో యూఏఈలో జరిగిన చివరి ఆసియన్ జూనియర్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ 21 పతకాలతో(ఆరు స్వర్ణాలు, తొమ్మిది రజతాలు, ఆరు కాంస్యాలు) మూడో స్థానంలో నిలిచింది.
సోమవారం మరో 15 మంది..
సోమవారం జరగనున్న యూత్ ఈవెంట్‌లో 15 మంది భారతీయ బాక్సర్లు స్వర్ణం కోసం పోటీపడనున్నారు. నివేదిత(48 కిలోలు), తమన్నా(50 కిలోలు), సిమ్రాన్(52 కిలోలు), నేహా(54 కిలోలు), ప్రీతి(57 కిలోలు), ప్రీతి దహియా(60 కిలోలు), ఖుషి(63 కిలోలు), స్నేహ(66 కిలోలు), ఖుషి(75 కిలోలు), తనిష్బీర్(81 కిలోలు) మహిళల విభాగంలో బరిలోకి దిగనున్నారు.
పురుషుల్లో విశ్వనాథ్ సురేశ్(48 కిలోలు), విశ్వామిత్ర చోంగ్‌థమ్(51 కిలోలు), జయదీప్ రావత్(71 కిలోలు), వంశజ్(64 కిలోలు), విశాల్(80 కిలోలు) ఫైనల్స్‌లో తలపడనున్నారు.
ఇదీ చూడండి: Bhavina Patel News: భవీనాకు గుజరాత్ సర్కారు భారీ నజరానా