కొవిడ్‌ను దృష్టిలో ఉంచుకొని ముందుజాగ్రత్త చర్యగా ప్రేక్షకులు లేకుండా టోక్యో ఒలింపిక్స్‌ను(Tokyo Olympics) నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ ప్రేక్షకులనే కాకుండా స్థానిక జపాన్ ప్రజలనూ స్టేడియాల్లోకి అనుమతించబోవటం లేదు. అదే సమయంలో ఈ కొవిడ్ ప్రతికూలతలనూ అనుకూలంగా మలచుకుంటున్నాయి జపాన్ వాణిజ్య సంస్థలు! రొబోటిక్ టెక్నాలజీలో ప్రపంచ దిగ్గజమైన జపాన్ రోబోలను కేవలం ఆటవస్తువులుగా కాకుండా మన రోజువారీ జీవనంలో భాగం చేసుకోవటానికున్న అవకాశాలను ఒలింపిక్స్ వేదికగా చూపించబోతున్నాయి.

ఆధునిక సాంకేతికత
జనం లేకుండా సాగుతున్న ఒలింపిక్స్‌ను సృజనాత్మకంగా మలుస్తోంది జపాన్! అడుగడుగునా ఆధునిక సాంకేతికతను మేళవిస్తూ, రోబోలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వర్చువల్ రియాల్టీలను వాడుకుంటూ.. జనాల్లేని లోటును తీర్చటానికి, ఒలింపిక్స్‌కు కొత్త సొబగులు అద్దటానికి జపాన్ సిద్ధమైంది. నిజానికి గతేడాదే జరగాల్సిన ఒలింపిక్స్ కొవిడ్ కారణంగా వాయిదా పడ్డాయి. అలా అనుకోకుండా కలసి వచ్చిన ఏడాది సమయాన్ని జపాన్, అక్కడి సంస్థలు ఎంతో సద్వినియోగం చేసుకున్నాయి. తమ ప్రయత్నాలకు, సదుపాయాలకు ఆధునికతను అద్దాయి.


అచ్చం మనుషుల్లాగే..
ఒలింపిక్స్ మస్కట్స్ అనగానే.. రెండు బొమ్మలు.. వాటిలాంటి వేషధారణలు చూడటం సర్వసాధారణం. ఈసారి ఒలింపిక్ మస్కట్స్ మిరైతోవా, సొమైటీలను రోబోల్లా తయారు చేసి.. వారితోనే షేక్‌హ్యాండ్‌లు, హైఫైవ్స్ ఇప్పించబోతోంది. అలాగని అవి మరయంత్రాల్లా ఉంటాయనుకునేరు. త్రీడీ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లను వాడి వీటిని జీవం ఉట్టిపడేలా తయారు చేశారు. మనలాగే హావభావాలు పలికిస్తాయి. ప్రేక్షకులు లేని నేపథ్యంలో వీటి తరహా రోబోలను వేలసంఖ్యలో స్టేడియాల్లో దించుతారని అంటున్నారు. మైదానంలోనూ రోబోలే ఆటగాళ్ళకు సాయం చేయబోతున్నాయి. వారికి ఆహార పదార్థాలు, పానీయాలు అందివ్వటం సహ.. జావెలిన్ త్రో, డిస్కస్ లాంటివాటిని అందివ్వటాలు.. అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావటాలూ.. ఈ రోబోలే చేయబోతున్నాయి. ప్రేక్షకులను అనుమతించినా.. స్టేడియంలో వారందరికీ సేవలందించే, పానీయాలు, ఆహారపదార్థాలు అందించే బాధ్యతలు రోబోలకే అప్పగించాలని అనుకున్నారు.


టొయోటాకు మంచి అవకాశం
ఈ ఒలింపిక్స్ అధికార స్పాన్సరైన టొయోటా కంపెనీ తన సాంకేతికతను, రాబోయే ఉత్పత్తులను ప్రదర్శించటానికి దీన్ని వేదికగా చేసుకుంటోంది. టొయోటా తయారు చేసిన టి-టిఆర్2 రోబో.. మారుమూల ప్రాంతాల్లో ఉన్న అభిమానులను స్టేడియంలోని ఆటగాళ్లతో అనుసంధానం చేసి స్టేడియంలో ఉన్న అనుభూతి కలిగిస్తూ.. మాట్లాడిస్తుంది. మైదానంలో ఆటలు కొనసాగేప్పుడు క్రీడాకారులకు పరికరాలను అందించే రోబోలు తయారు చేసింది టొయోటానే! అంతేగాకుండా.. ఒలింపిక్ గ్రామంలో.. వాడే డ్రైవర్‌లేని ఆధునిక సదుపాయాలతో కూడిన వాహనాలు (ఈపాలెట్) మునుముందు మార్కెట్లోకి రాబోయేవాటికి సంకేతాలు! ఇక పానసోనిక్ కంపెనీ రూపొందించిన పవర్ అసిస్ట్ సూట్లు.. ఎంతటి బరువునైనా అలవోకగా ఎత్తేందుకు దోహదం చేస్తాయి.


పతకాల్లో.. ఎలక్ట్రానిక్ తుక్కు
ఈసారి ఒలింపిక్ విజేతలకిచ్చే పతకాలను ఎలక్ట్రానిక్ వ్యర్థాల రీసైక్లింగ్‌తో తయారు చేశారు. ఇందుకోసం జపాన్ ప్రజలు తమ వ్యక్తిగత, ఇళ్లలోవాడే, పాడైన ఎలక్ట్రానిక్ పరికరాలను (ల్యాప్‌టాప్‌లు, ఫోన్లు, కెమెరాలు) దానం చేశారు. ఇలా సేకరించిన సుమారు 79వేల టన్నుల వ్యర్థాలను రీసైకిల్ చేసి.. 5 వేలకుపైగా పతకాలను సిద్ధం చేశారు. ఒలింపిక్ గ్రామంలో ఆటగాళ్ల కోసం సిద్ధం చేసిన పడకలు కూడా.. కార్డుబోర్డుతో చేసినవే. వీటిని ఎక్కడికంటే అక్కడికి మడతపెట్టి తీసుకొని పోవచ్చు. పనైపోయాక.. రీసైకిల్ కూడా చేసుకోవచ్చు.

ఇదీ చూడండి.. టోక్యోకు బయలుదేరిన భారత క్రీడాకారుల బృందం