బర్మింగ్హమ్ వేదికగా 2022లో జరగనున్న కామన్వెల్త్ క్రీడల్లో షూటింగ్‌ను తొలగించొద్దని కోరుతూ యూకే క్రీడాశాఖ సెక్రటరీ నిక్కీ మోర్గాన్‌కు లేఖ రాశారు భారత క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజుజు. ఈ ఏడాది జూన్‌లో సమావేశమైన కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్(సీడబ్ల్యూఎఫ్).. ప్రతిష్టాత్మక టోర్నీ నుంచి షూటింగ్‌ను తొలగించాలని నిర్ణయించింది. దీనిపై ఇప్పటికే భారత ఒలింపిక్ సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. నిర్ణయాన్ని మార్చుకోకపోతే ఈవెంట్ నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించింది.
" కామన్వెల్త్ క్రీడల ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ప్రస్తుతం భారత్ ప్రాతినిధ్యం వహించట్లేదు. ఫలితంగా 2022 టోర్నీ నుంచి షూటింగ్ తప్పించాలన్న నిర్ణయంపై మా అభ్యంతరాన్ని గట్టిగా చెప్పలేకపోతున్నాం. కామన్వల్త్లో 53 దేశాలు కలిసి ఉన్నాయి. వాటి జనాభా 2.4 బిలియన్ కోట్లు. ఇందులో భారత్ జనాభా సగం. ఈ సంఖ్యతో కామన్వెల్త్ టోర్నీకి మరింత ఆదరణ లభిస్తుంది. భారత షూటర్లు ఇందులో ఆడాలని మా దేశ ప్రజలు కోరుకుంటున్నారు. అంతర్జాతీయ షూటింగ్ సమాఖ్య కూడా ఈ క్రీడను చేర్చితే కొంత మొత్తాన్ని భరించేందుకు సిద్ధమవుతోంది. కాబట్టి ఈ సమస్యలో మీరు కొంచెం కలగజేసుకోవాలని కోరుకుంటున్నా."
--కిరణ్ రిజుజు, క్రీడాశాఖ మంత్రి
బర్మింగ్‌హామ్‌లో షూటింగ్ క్రీడ లేకపోతే భారత్‌కు పతక అవకాశాలు దెబ్బతింటాయి. సీడబ్ల్యూజీ ఆల్‌టైమ్ షూటింగ్ మెడల్స్ జాబితాలో భారత్ రెండో స్థానంలో ఉంది. ఇప్పటివరకు ఇండియా 118 పతకాలు సాధించగా.. వాటిలో 56 స్వర్ణాలు ఉన్నాయి.