భారత క్రీడారంగానికి డోపింగ్ పెద్ద సమస్యగా తయారైంది. ఏ క్రీడలో అయినా ఎవరో ఒకరు నిషేధిత ఉత్ప్రేరకాలు వాడుతూ దొరికిపోతున్నారు. తాజాగా డోపింగ్ పరీక్షల్లో ముగ్గురు వెయిట్ లిఫ్టర్లు, ఒక బాక్సర్, ఒక షూటర్ విఫలమయ్యారు.
కెరీర్‌పై ప్రభావం..
డోపింగ్‌కు పాల్పడిన ఆటగాళ్లు కెరీర్‌ను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా దొరికిన ఐదుగురు క్రీడాకారులకు జాతీయ డోపింగ్ నిరోధక సంఘం (నాడా) 2-4 ఏళ్లు నిషేధం విధించింది. ఈ కాలంలో వీరు ఆటల్లో పాల్గొనడానికి అనర్హులు.
పతకాలు తెచ్చిన ఆటగాళ్లే...
తాజాగా వేటు పడిన ఆటగాళ్లలో ప్రపంచస్థాయి పోటీల్లో పతకం తెచ్చిన క్రీడాకారుడూ ఉన్నాడు. షూటింగ్ ప్రపంచకప్‌లో మెడల్ అందుకున్న రైఫిల్ షూటర్ రవి కుమార్‌పై రెండేళ్ల నిషేధం విధించింది నాడా క్రమశిక్షణ బృందం (ఏడీపీపీ). వైద్యం కోసం ఉపయోగించిన ఔషధంలో నిషేధిత ఉత్ప్రేరకం ఉన్నట్టు తెలియదన్న అతడి వాదనను నాడా పరిగణలోకి తీసుకోలేదు. నమూనా పరీక్షలకు అంగీకరించలేదని అధికారులు తెలిపారు. ఫలితంగా అతడిపై విధించిన నిషేధం డిసెంబర్ 5 నుంచి కొనసాగుతుందని నాడా అధికారి స్పష్టం చేశారు. 2021లో మళ్లీ క్రీడల్లో అడుగుపెట్టనున్నాడు రవి. అప్పటికి అతడు మళ్లీ ఫామ్ అందుకోవడం కష్టమని క్రీడా పండితులు అంటున్నారు.
- 2017 కామన్వెల్త్ ఛాంపియన్‌షిప్‌లో రజతం కైవసం చేసుకున్న వెయిట్ లిఫ్టర్ సీమపై 4 ఏళ్ల నిషేధం విధించారు. ఆమె నమూనాలు పరీక్షించగా అందులో అనబోలిక్ స్టెరాయిడ్ ఉన్నట్టు తేలింది.
- 2016లో జూనియర్ కామన్వెల్త్‌లో స్వర్ణం గెలిచిన వెయిట్ లిఫ్టర్ పూర్ణిమ పాండేపై నాలుగేళ్ల నిషేధాన్ని నాడా రెండేళ్లకు తగ్గించింది.
- మరో వెయిట్ లిఫ్టర్ ముకుల్ శర్మకు నాలుగేళ్లు, బాక్సర్ దీపక్ శర్మ (91 కిలోలు)కు రెండేళ్ల నిషేధం విధించారు.
ఆసియా క్రీడల్లో రజతం గెలిచిన బాక్సర్ సుమిత్ సంగ్వాన్ రెండో నమూనా పరీక్షలోనూ విఫలమయితే అతడి భవిష్యత్తు తేలనుంది. ఈ నెలలో దేశవాళీ, అంతర్జాతీయ పోటీలు ఉండటం వల్ల త్వరగా తన నిషేధాన్ని తేల్చాలని సంగ్వాన్ కోరాడని తెలిసింది.