తనకు అవకాశం వస్తే భారత్ ఆడిన రెండు సెమీఫైనల్ మ్యాచ్‌ల ఫలితాలను మార్చాలని ఉందని మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి తెలిపారు. అందులో ఒకటి ఆటగాడిగా, మరొకటి కోచ్‌గా ఉన్నప్పటివని గుర్తు చేశారు. గతేడాది టీ20 ప్రపంచకప్ వరకు భారత క్రికెట్ ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రి బాధ్యతలు నిర్వర్తించిన విషయం తెలిసిందే. రవిశాస్త్రి హయాంలోనే భారత్ విదేశీ గడ్డ మీద సిరీస్‌లను నెగ్గింది. అలానే 2019 ఐసీసీ ప్రపంచకప్‌లో సెమీస్‌కు చేరుకుంది. అయితే వాతావరణం సహకరించకపోవడం వల్ల రెండు రోజులపాటు సాగిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 18 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఒకే రోజులో మ్యాచ్ జరిగితే భారత్ విజయం సాధించేందని రవిశాస్త్రి పేర్కొన్నారు. దీంతో పాటు 1987 ప్రపంచకప్ సెమీస్‌లోనూ టీమ్ఇండియా గెలిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు.
‘‘2019 వన్డే ప్రపంచకప్‌లో విరాట్ నేతృత్వంలోని భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. అన్ని విభాగాల్లో పటిష్ఠంగా ఉన్న టీమ్‌ఇండియా సెమీస్‌కు చేరుకుంది. న్యూజిలాండ్‌ను 239/8 స్కోరుకే కట్టడి చేసింది. అయితే వర్షం పడటంతో పిచ్ బౌలింగ్ సహకరించడం ప్రారంభించింది. వర్షం రాకుండా ఉండి ఒకే రోజు మ్యాచ్ జరిగితే మాత్రం విజయం భారత్‌దే. ఎందుకంటే టీమ్‌ఇండియా ఆటగాళ్ల ఫామ్ బాగుంది. వర్షం రాకతో 221 పరుగులకే పరిమితమై భారత్ ఓటమిపాలైంది’’ అని వివరించారు.
ఇక రెండో సెమీఫైనల్ మ్యాచ్ గురించి చెబుతూ.. ‘‘1987 వరల్డ్ కప్‌లోనూ భారత్ సెమీస్‌కు చేరింది. అయితే ఇంగ్లాండ్ చేతిలో ఓటమిపాలు కావడం బాధించింది. ఎందుకంటే 1983 ప్రపంచకప్‌లో బరిలోకి దిగిన భారత్ జట్టు కంటే 87 టీమ్ ఇంకా పటిష్ఠంగా ఉంది’’ అని రవిశాస్త్రి పేర్కొన్నారు. ఆ ప్రపంచకప్‌ను ఆలెన్ బోర్డర్ నాయకత్వంలోని ఆసీస్ కైవసం చేసుకుంది.
ఇదీ చదవండి: IPL 2022: దిల్లీ క్యాపిటల్స్‌లో కరోనా కలకలం