దిల్లీ వేదికగా జరుగుతున్న ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో భారత క్రీడాకారులు తుదిమెట్టుపై బోల్తా పడ్డారు. పలు విభాగాల్లో నలుగురు రెజ్లర్లు ఫైనల్కు చేరగా... ఒక్కరికే పసిడి దక్కింది. మిగతా ముగ్గరూ రజతాలతోనే సరిపెట్టుకున్నారు. ఈ మెగా ఈవెంట్లో రవి దహియా స్వర్ణంతో మెరిశాడు. పురుషుల 57 కేజీల విభాగం ఫైనల్లో అతడు 14-5 తేడాతో.. మాజీ ప్రపంచ ఛాంపియన్ యుకి తకహషి (జపాన్)ను చిత్తు చేసి పసిడి గెలిచాడు.
బజరంగ్ నిరాశ...
టోక్యో ఒలింపిక్స్‌లో పతక ఆశలు రేపుతున్న బజ్‌రంగ్ పునియా (65 కేజీలు) తాజాగా జరిగిన ఫైనల్లో రజతంతో సరిపెట్టుకున్నాడు. డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఈ టోర్నీలో అడుగుపెట్టిన బజరంగ్.. 1-10తో టకుటో (జపాన్) చేతిలో కంగుతిన్నాడు. ఫైనల్ చేరే క్రమంలో ప్రత్యర్థులకు కేవలం రెండే పాయింట్లు ఇచ్చిన బజరంగ్.. స్వర్ణ పోరులో మాత్రం తేలిపోయాడు.
సత్యవర్త్ కడియన్ (97 కేజీలు), గౌరవ్ బాలియన్ (79 కేజీలు) రజత పతకాలు సాధించారు. తుది సమరంలో ముజ్తబా (ఇరాన్) చేతిలో సత్యవర్త్, అర్సాలన్ (కిర్గిస్థాన్) చేతిలో గౌరవ్ ఓడిపోయారు. కాంస్య పతక పోరులో నవీన్ (70 కేజీలు) పరాజయం చవిచూశాడు. ఫలితంగా పతకం లేకుండా నవీన్ పోరు ముగిసింది.